KomatiReddy: తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు కారణమైన వ్యాఖ్యలు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో జరిగిన అవినీతి అంశంపై స్పందించిన ఆయన, “కేటీఆర్ జాగ్రత్తగా ఉండాలని స్వయంగా కల్వకుంట్ల కవితనే హెచ్చరించారు” అని సంచలన వ్యాఖ్య చేశారు.
కోమటిరెడ్డి ప్రకారం, “కాళేశ్వరం ప్రాజెక్టులో హరీశ్‌రావు, సంతోష్‌రావు దోచుకున్నారని కవిత స్పష్టంగా చెప్పారు. అవినీతి అంశంలో రామన్నా జాగ్రత్త అని కూడా కవితనే అన్నారని” గుర్తు చేశారు.
జూబ్లీహిల్స్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కోమటిరెడ్డి మాట్లాడుతూ, “బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఐదు ముక్కలైందని. కేటీఆర్ నా స్థాయికి సరిపడే వ్యక్తి కాదని. నేను మొదటిసారి ఎమ్మెల్యే అయ్యే సమయానికి ఆయన గుంటూరులో చదువుకుంటున్నాడు. పేదలకు సన్నబియ్యం ఇవ్వాలనే ఆలోచన చేయని కేటీఆర్ గురించి మాట్లాడటం అవసరం లేదు” అని ఎద్దేవా చేశారు.
అదే కార్యక్రమంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా వ్యాఖ్యానిస్తూ, “జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడం ఖాయం. కంటోన్మెంట్ ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కలేదు. వరుస ఎన్నికల్లో ఓటమి భయంతో కేటీఆర్, హరీశ్‌రావు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. కవిత చేసిన అవినీతి ఆరోపణల ఆధారంగానే వీరిపై ఫిర్యాదు చేశాం” అని అన్నారు.

