Jogi Ramesh

Jogi Ramesh: తప్పు చేశానని చెబితే ఇక్కడే ఉరి వేసుకుని చచ్చిపోతా..దుర్గ గుడిలో జోగి రమేష్‌ ప్రమాణం.

Jogi Ramesh: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన ములకలచెరువు, ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం కుంభకోణం కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి జోగి రమేష్ కొత్త రాజకీయ పోరాటానికి తెరలేపారు. తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి న్యాయస్థానాలను కాకుండా, దైవస్థానాలను ఎంచుకున్న ఆయన.. నేడు విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారి ఎదుట సత్య ప్రమాణం చేశారు.

తన కుటుంబ సభ్యులతో కలిసి దుర్గమ్మ ఆలయానికి వచ్చిన జోగి రమేష్, గుడి ప్రాంగణంలో దీపం పట్టుకొని.. “కల్తీ మద్యం కేసులో తన ప్రమేయం లేదని, తన హృదయాన్ని గాయపరిచారని, తన వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారని” అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేశారు.

‘దైవ ప్రమాణం’ వెనుక రాజకీయం, సాక్ష్యాధారాల సవాల్

తనపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని నిరూపించుకోవడానికి జోగి రమేష్ ఈ ‘శీల పరీక్ష’కు సిద్ధమయ్యారు. అయితే, ఈ దైవ ప్రమాణాలు రాజకీయాల్లో ఎంతవరకు సత్యమని, న్యాయపరంగా ఎంతవరకు ప్రామాణికమని తీవ్ర చర్చ జరుగుతోంది.

  • నిందితుడి వాంగ్మూలం: ఈ కేసులో ప్రధాన నిందితుడు (A-1)గా అరెస్టయిన అద్దేపల్లి జనార్దన్ రావు, ఈ పనిని మాజీ మంత్రి జోగి రమేష్ చేయించారని పోలీసులకు తెలిపినట్లు సమాచారం.
  • సాక్ష్యాధారాలు: జనార్దన్ రావు అరెస్ట్ సందర్భంగా కీలక ఆధారాలను అధికారులకు అందించినట్లు తెలుస్తోంది. అంతేకాక, జోగి రమేష్‌తో నిందితుడికి సన్నిహిత సంబంధాలున్నట్లు తెలిపే వాట్సాప్ చాట్ మరియు ఇద్దరూ చనువుగా కనిపించిన ఫోటోలు కూడా మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.
  • ప్రమాణాల ప్రామాణికత: ఈ నేపథ్యంలో, జోగి రమేష్ చేసిన ఈ సత్య ప్రమాణాలు న్యాయస్థానాన్ని ఏమాత్రం ప్రభావితం చేయలేవని న్యాయ నిపుణులు అంటున్నారు. అధికారుల దగ్గర జోగి రమేష్ ప్రమేయంపై సాక్ష్యాధారాలు (డాక్యుమెంట్లు, డిజిటల్ డేటా) ఉంటే, ఈ దైవ ప్రమాణాలు వాటిని బూడిద చేయలేవు. తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి ఈ దైవ ప్రమాణాలు న్యాయపరమైన ప్రామాణికం కాబోవు.

ఇది కూడా చదవండి: Gold Price Today: బంగారం ధరలు నేడు తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?

లై డిటెక్టర్ టెస్ట్‌కు సై: జోగి రమేష్

తనను రాజకీయంగా ఎదుర్కోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు మంత్రి లోకేష్ కుట్ర రాజకీయాలకు తెరలేపుతున్నారని, తప్పుడు కేసులు మోపి కక్ష్య సాధింపులకు పాల్పడుతున్నారని జోగి రమేష్ కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు.

తనపై వస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని నిరూపించుకోవడానికి, తాను ఏకంగా నార్కో ఎనాలసిస్ (Narco Analysis) లేదా, లై డిటెక్టర్ టెస్ట్‌ (Lie Detector Test)కైనా సిద్ధమని జోగి రమేష్ సవాల్ విసిరారు.

మొత్తం మీద, ఈ కేసులో ‘సత్యం’ న్యాయస్థానంలో సాక్ష్యాధారాల ద్వారా నిరూపితం అవుతుందా, లేక రాజకీయ దుమారంగానే మిగిలిపోతుందా అనేది వేచి చూడాలి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *