Amravati: తుపాను ప్రభావం కారణంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర చర్యలు ప్రారంభించింది. ఈ క్రమంలో తుపానుతో ప్రభావితమైన జిల్లాలకు టీఆర్–27 కింద నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది.
ఈ నిధులను ప్రధానంగా బాధితులను సురక్షిత ప్రదేశాలకు తరలించడానికి, సహాయ శిబిరాల్లో తాగునీరు, ఆహారం, పాలు వంటి అవసరమైన వస్తువులు అందించడానికి వినియోగించనున్నారు. అదనంగా తుపానుతో దెబ్బతిన్న రహదారులు, విద్యుత్ సదుపాయాలు, నీటి సరఫరా వ్యవస్థలు వంటి మౌలిక వసతుల మరమ్మతులకు ఈ నిధులు ఉపయోగించాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి.
ప్రభుత్వం ఇప్పటికే ప్రభావిత ప్రాంతాల్లో రెస్క్యూ బృందాలను మోహరించింది. తుపాను ప్రభావం తగ్గేవరకు ఎలాంటి నిర్లక్ష్యం చేయరాదని సంబంధిత శాఖలకు అధికారులు స్పష్టమైన సూచనలు ఇచ్చారు. తుపాను బాధితుల పునరావాసానికి అవసరమైన అన్ని చర్యలు త్వరితగతిన చేపట్టాలని ప్రభుత్వం ఆదేశిచింది.

