Ktr: రాష్ట్రంలో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పే సమయం వచ్చిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచే బీఆర్‌ఎస్ జైత్రయాత్ర మళ్లీ ప్రారంభమవుతుందని ఆయన స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు వాస్తవం కాలేదని, పేదల ఆశలు దెబ్బతిన్నాయని కేటీఆర్ మండిపడ్డారు. “కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజల కష్టాలు తగ్గాయి. ఉచిత మంచినీళ్లు, బస్తీ దవాఖానాలు, రూ.5 భోజనం, పింఛన్లు, రంజాన్ తోఫా వంటి అనేక పథకాలు విజయవంతంగా అమలు చేశాం,” అని ఆయన గుర్తు చేశారు.
“ఇప్పుడేమో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను బకాయిలతో ముంచేసింది. వృద్ధులు, రైతులు, మహిళలు అందరినీ మోసం చేసింది. మేం ఒకసారి మోసపోయాం కానీ ఇప్పుడు జూబ్లీహిల్స్ ప్రజలు మోసపోవద్దు” అని హెచ్చరించారు.
కేటీఆర్ మాట్లాడుతూ, “ప్రజల అభివృద్ధి కోసం మేము కట్టుబడి ఉన్నాం. జూబ్లీహిల్స్ నుంచి బీఆర్‌ఎస్ బలమైన పునరాగమనం ప్రారంభమవుతుంది. మోసాన్ని మోసంతో కాదు, నిజాయితీతోనే జయించాలి. ప్రజల నిజమైన అభివృద్ధి కోసం బీఆర్‌ఎస్‌ను మళ్లీ అధికారంలోకి తీసుకురావాలి” అని పిలుపునిచ్చారు.
జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశమయ్యాయి.

