Crime News: కర్ణాటకలోని మైసూరు జిల్లా, పిరియాపట్న తాలూకాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. బాత్రూమ్‌లో గ్యాస్ గీజర్ నుంచి విష వాయువు లీకై దాన్ని పీల్చడంతో ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఊపిరాడక మరణించారు. కొత్త ఇంట్లోకి మారిన సందర్భంగా పూజ పెట్టుకున్న రోజే ఈ విషాదం జరగడంతో కుటుంబంలో తీరని శోకం నెలకొంది. బెట్టదపుర ప్రాంతానికి చెందిన అల్తాఫ్ పాషా కుమార్తెలు గుల్బమ్ తాజ్ (23), సిమ్రాన్ తాజ్ (21). గుల్బమ్ తాజ్‌కు ఇటీవల నిశ్చితార్థం కూడా జరిగింది. పిరియాపట్నలోని జోనిగేరి వీధిలో అల్తాఫ్ పాషా కుటుంబం ఇటీవల కొత్త అద్దె ఇంట్లోకి మారింది. గురువారం రాత్రి సుమారు 7 గంటల సమయంలో, కొత్త ఇంటికి సంబంధించిన పూజ కార్యక్రమం జరుగుతుండగా, ఇద్దరు సోదరీమణులు స్నానం చేయడానికి వెళ్లారు.
బాత్రూమ్‌లోకి వెళ్లిన వెంటనే, అక్కడ ఆన్ చేసిన గ్యాస్ గీజర్ నుంచి కార్బన్ మోనాక్సైడ్ అనే విష వాయువు లీకైంది. ఆ వాయువును పీల్చిన కారణంగా ఇద్దరూ శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది పడి, అక్కడే అపస్మారక స్థితిలో కుప్పకూలిపోయారు. చాలా సేపటి వరకు కుమార్తెలు బయటకు రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు తలుపు తెరిచి చూడగా, ఇద్దరూ అచేతనంగా పడి ఉన్నారు. వెంటనే వారిని చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహించిన డాక్టర్ ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ.. కార్బన్ మోనాక్సైడ్ వాయువు పీల్చడం వల్లే యువతులు మరణించినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ప్రజలు గ్యాస్ గీజర్‌లను ఉపయోగించేటప్పుడు తప్పనిసరిగా వెంటిలేషన్ ఉన్న ప్రదేశంలో మాత్రమే వాడాలి.
లేదంటే ఇలాంటి ఘోరాలు జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. పూజా కార్యక్రమానికి, గుల్బమ్ తాజ్ కాబోయే భర్త కుటుంబ సభ్యులు (వియ్యంకులు) కూడా ఇంట్లోనే ఉన్న సమయంలో ఈ విషాదం చోటుచేసుకోవడం ఆ కుటుంబాన్ని తీవ్ర దుఃఖంలో ముంచింది. ఈ ఘటనపై పిరియాపట్న పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. మృతుల కుటుంబ సభ్యులను మంత్రి కె.వెంకటేష్ పరామర్శించి, వారికి సానుభూతి తెలిపారు.

