Viral News: అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రంలో భారత సంతతికి చెందిన మోహుల్ గోస్వామి (39) అనే వ్యక్తి డ్యూయల్ జాబ్ కేసులో దొరికిపోయాడు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూనే రహస్యంగా మరో ప్రైవేట్ కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తున్నాడని తేలడంతో కోర్టు అతనికి 15ఏళ్ల జైలు శిక్ష విధించింది.
న్యూయార్క్‌లోని లాథమ్ ప్రాంతానికి చెందిన గోస్వామి, న్యూయార్క్ స్టేట్ ఆఫీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీసెస్ (ITS) లో అధికారిగా పనిచేస్తున్నాడు. అయితే, అదే సమయంలో మాల్టా పట్టణంలో మరో సంస్థలో కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తున్నట్టు బయటపడింది. దీనిపై విచారణ జరిపిన అధికారులు, గోస్వామి నిర్లక్ష్యం కారణంగా సుమారు రూ.44 లక్షల ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అయ్యాయని నిర్ధారించారు.
తదుపరి విచారణలో కోర్టు, గోస్వామి చర్యను ప్రజల విశ్వాసానికి భంగం కలిగించే నేరంగా పేర్కొంది. డ్యూయల్ ఎంప్లాయ్మెంట్ అమెరికాలో చట్టవిరుద్ధం అని, ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ మరో ఉద్యోగం చేయడం ప్రజా వనరుల దుర్వినియోగమని కోర్టు స్పష్టం చేసింది.
‘మూన్‌లైటింగ్’పై మళ్లీ చర్చ
ఈ ఘటనతో అమెరికా ఐటీ రంగంలో మరోసారి మూన్‌లైటింగ్ అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఒక కంపెనీలో పనిచేస్తూ రహస్యంగా మరో సంస్థలో కూడా పని చేయడాన్ని మూన్‌లైటింగ్ అంటారు. వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రాచుర్యం పొందిన తర్వాత ఈ ధోరణి గణనీయంగా పెరిగింది.
తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని భావించే కొందరు ఉద్యోగులు రెండు ఉద్యోగాలు చేస్తూ చివరికి చట్టపరమైన ఇబ్బందుల్లో చిక్కుకుంటున్నారు. భారతదేశంలో ఈ ట్రెండ్ తక్కువగానే ఉన్నా, అమెరికాలో ముఖ్యంగా భారతీయ ఐటీ వర్కర్లు ఈ మార్గంలో నడవడం ఎక్కువగా కనిపిస్తోంది.
ఇప్పుడు గోస్వామి ఘటన అందరికీ హెచ్చరికలా మారింది. ఒక్కసారిగా రెండు ఉద్యోగాలు చేయడం వలన పొందే తాత్కాలిక లాభాలు, చివరికి జీవితాన్ని శిక్షలతో నిండిన దారిలోకి నెట్టేస్తాయని ఈ కేసు మరోసారి నిరూపించింది.

