Pawan Kalyan: విజయవాడలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి అటవీశాఖ అధికారుల వర్క్‌షాప్‌లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యంపై కీలక వ్యాఖ్యలు చేశారు. “మన అందరి ప్రథమ బాధ్యత అడవులను కాపాడటం. ఆ బాధ్యతను ప్రతి ఒక్కరూ సమర్థంగా నిర్వర్తించాలి” అని ఆయన పిలుపునిచ్చారు.
పర్యావరణం, అటవీ శాఖలు నా హృదయానికి దగ్గరైనవి: పవన్
పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. “మా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నేను ఎంతో ఇష్టంతో ఎంచుకున్నవి పర్యావరణం, అటవీ శాఖలు. ఒక వ్యవస్థ ముందుకు సాగాలంటే దాన్ని నడిపే వ్యక్తులు ముఖ్యమైనవారు. రివ్యూ మీటింగుల ద్వారా అటవీ శాఖలో సిబ్బంది కొరత ఉన్న విషయం నా దృష్టికి వచ్చింది. అధికారులు అధిక పని భారం మోయుతున్నారు – ఇది నేను అర్థం చేసుకోగలను” అన్నారు.
సిబ్బందిని ఇబ్బంది పెడితే తీవ్ర చర్యలు
“డ్యూటీ చేస్తున్న అటవీ అధికారులను ఎవరు ఇబ్బంది పెట్టినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఈ విషయం కూటమి పార్టీల నాయకులకు కూడా స్పష్టంగా తెలియజేశాను” అని పవన్ హెచ్చరించారు. ఫ్రంట్ లైన్ ఫారెస్ట్ సిబ్బంది అత్యంత కఠిన పరిస్థితుల్లో పనిచేస్తారని, వారి భద్రత, సంక్షేమం పట్ల ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని హామీ ఇచ్చారు.
2047 నాటికి 50% పచ్చదనం లక్ష్యం
ప్రస్తుతం రాష్ట్రంలో 22 శాతం మాత్రమే పచ్చదనం ఉందని, దానిని 2047 నాటికి 50 శాతం వరకు పెంపొందించడమే లక్ష్యమని పవన్ కల్యాణ్ తెలిపారు. “ఇది సులభం కాదు, కానీ సాధ్యమే. అధికారులతో, నిపుణులతో కలిసి దీన్ని సాధించేందుకు కృషి చేద్దాం” అని ఆయన అన్నారు.
అటవీ సిబ్బంది సంక్షేమానికి రూ.5 కోట్లు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో రూ.5 కోట్ల నిధిని అటవీ సిబ్బంది సంక్షేమం కోసం ఏర్పాటు చేశాం అని పవన్ వెల్లడించారు. “కొత్త నియామకాల్లో ఎటువంటి సిఫార్సులకు తావు ఇవ్వం. ప్రతిభ, కట్టుబాటు ఆధారంగానే నియామకాలు జరుగుతాయి” అని స్పష్టం చేశారు.
‘గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్ట్’తో తీరప్రాంత రక్షణ
పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. “ఆంధ్రప్రదేశ్ గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించాం. శ్రీకాకుళం నుండి నెల్లూరు వరకు ఉన్న తీరప్రాంతాన్ని సంరక్షించడం దీని లక్ష్యం. నేను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో ప్రతి సంవత్సరం పది అడుగుల చొప్పున తీరభాగం కోతకు గురవుతోంది. ఈ కోతను నివారించడానికి 974 కిలోమీటర్ల తీరప్రాంత రక్షణకు ఈ ప్రాజెక్ట్ దోహదం చేస్తుంది” అని వివరించారు.

