West Indies: బంగ్లాదేశ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను వెస్టిండీస్ జట్టు 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. గురువారం జరిగిన సిరీస్‌లోని చివరిదైన మూడో వన్డేలో విండీస్.. బంగ్లాదేశ్‌పై 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో దశాబ్దం తర్వాత బంగ్లాదేశ్‌పై వన్డే సిరీస్ గెలిచిన రికార్డును వెస్టిండీస్ సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. మహ్మదుల్లా (84), జేకర్ అలీ (62) ఆరో వికెట్‌కు 150 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అనంతరం 322 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 45.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. విండీస్ తరఫున అరంగేట్రం చేసిన వికెట్ కీపర్ బ్యాటర్ అమీర్ జాంగూ (104 నాటౌట్) అద్భుత సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతనికి కేసీ కార్టీ (95) అండగా నిలిచాడు. జాంగూ తన సెంచరీని కేవలం 80 బంతుల్లోనే పూర్తిచేసి, అరంగేట్రంలో వేగవంతమైన సెంచరీ చేసిన విండీస్ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఈ ఛేదన ఈ వేదికపై అత్యుత్తమ ఛేదన కావడం విశేషం. విండీస్ విజయాన్ని గూడకేశ్ మోతీ (44 నాటౌట్) సిక్సర్‌తో ముగించాడు. ఈ ప్రదర్శనకు అమీర్ జాంగూకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
Also Read: ICC Women’s World Cup 2025: మహిళల ప్రపంచ కప్: భారత్ సెమీస్‌లోకి

