Chandrababu: యూఏఈ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండో రోజు కూడా బిజీ బిజీ షెడ్యూల్‌తో కొనసాగుతున్నారు. అబుదాబీలో వరుసగా పారిశ్రామిక వేత్తలతో సమావేశాలు నిర్వహిస్తూ, రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలను వివరించారు.
అబుదాబీ వ్యాపార వేత్తలతో వరుస భేటీలు
చంద్రబాబు అబుదాబీ చాంబర్ చైర్మన్ అహ్మద్ జాసిమ్ అల్ జాబీ, జీ42 సీఈఓ మాన్సూర్ అల్ మాన్సూరీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. “ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా ఆంధ్రప్రదేశ్ వేగంగా ముందుకు సాగుతోంది” అని సీఎం తెలిపారు.
అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ కేంద్రం
చంద్రబాబు తెలిపారు “జనవరి నెలలో అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ సేవలు ప్రారంభం కానున్నాయి. రాజధాని నగరం కొత్త ఆవిష్కరణలకు, టెక్నాలజీ అభివృద్ధికి కేంద్రంగా మారనుంది” అన్నారు.
ఇది కూడా చదవండి: Bigg Boss 9: ఎలిమినేషన్ కి ముందే బిగ్‌బాస్ నుంచి అయేషా ఔట్.. ఎందుకో తెలుసా..?
విశాఖ భాగస్వామ్య సదస్సుకు ఆహ్వానం
వచ్చే నెల నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సుకు పారిశ్రామిక వేత్తలను రావాలని సీఎం ఆహ్వానించారు. దీనికి ప్రతిస్పందనగా యూఏఈ కంపెనీల ప్రతినిధులు ఏపీ పర్యటనకు ఆసక్తి చూపుతూ, పెట్టుబడులపై సీరియస్‌గా ఆలోచిస్తామని తెలిపారు.
ఇంధన రంగంలో పెట్టుబడులపై చర్చ
తర్వాత చంద్రబాబు అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ (ADNOC) ప్రతినిధులతో సమావేశమయ్యారు. భారత్‌లో తమ వ్యాపారాన్ని విస్తరించాలన్న ఆసక్తి వ్యక్తం చేసిన ఏడీఎన్‌వోసీ అధికారులకు, ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన మరియు పెట్రో కెమికల్ రంగాల్లో ఉన్న పెట్టుబడి అవకాశాలను సీఎం వివరించారు.
“దక్షిణాసియాకు దగ్గరగా ఉన్న వ్యూహాత్మక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, సుదీర్ఘ తీరప్రాంతం కలిగి ఉండటం వల్ల ఇంధన రంగానికి అపార అవకాశాలు ఉన్నాయి” అని చంద్రబాబు వివరించారు.
నెట్వర్క్ లంచ్‌లో ప్రముఖ సీఈఓలతో భేటీ
అబుదాబీ నెట్వర్క్ లంచ్‌లో జీ42 సీఈఓ మనుకుమార్ జైన్, ADIC గ్లోబల్ హెడ్ లలిత్ అగర్వాల్, IHC సీఈఓ అజయ్ భాటియా, WIO బ్యాంక్ సీఈఓ జయేష్ పాటిల్, పాలిగాన్ మార్ఫిక్ సీఈఓ జయంతి కనాని, పాలసీ బజార్ గ్రూప్ సీఈఓ యశిష్ దహియా, నూన్ సీఈఓ ఫరాజ్ ఖలీద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ పెట్టుబడి అవకాశాలపై సుదీర్ఘంగా చర్చలు జరిగాయి.