Hyderabad: పదవికి రాజీనామా చేసిన ఐఏఎస్ అధికారి సయ్యద్ అలీ ముర్తజా రిజ్వీ

Hyderabad: తెలంగాణ ప్రభుత్వంలో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తజా రిజ్వీ స్వచ్ఛంద పదవీ విరమణ (VRS) ప్రకటించారు.మంత్రి జూపల్లి కృష్ణారావుతో లిక్కర్ హోలోగ్రామ్ టెండర్ల విషయంలో నెలలుగా కొనసాగుతున్న విభేదాలు ఈ నిర్ణయానికి దారితీశాయని అధికార వర్గాలు చెబుతున్నాయి.

రిజ్వీ వ్యక్తిగత కారణాలతోనే పదవీ విరమణ కోరినట్లు పేర్కొన్నప్పటికీ, వెనుక కథ మాత్రం వేరుగా ఉందని సమాచారం. లిక్కర్ సీసాలపై అతికించే హై-సెక్యూరిటీ హోలోగ్రామ్ టెండర్ల విషయంలో మంత్రితో ఆయనకు తీవ్ర విభేదాలు తలెత్తినట్టు తెలుస్తోంది.

వీఆర్ఎస్‌ను అడ్డుకోవాలని మంత్రివర్గం ప్రయత్నం

మంత్రి జూపల్లి కృష్ణారావు రిజ్వీపై టెండర్ల ప్రక్రియను ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేశారని, దాంతో పాత వెండర్‌కు లాభం కలిగిందని ఆరోపించారు.

రిజ్వీపై క్రిమినల్ విచారణ అవసరం ఉందని పేర్కొంటూ, ఆయన వీఆర్ఎస్ దరఖాస్తును తిరస్కరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు.అయితే ప్రభుత్వం మంత్రి అభ్యంతరాలను పక్కనబెట్టి, రిజ్వీ వీఆర్ఎస్‌ను ఆమోదించింది. ఆయన స్థానంలో వాణిజ్య పన్నుల కమిషనర్ ఎం. రఘునందన్ రావుకు అదనపు బాధ్యతలు అప్పగించారు.

వివాదం ఎలా మొదలైంది?

నకిలీ మద్యం, అక్రమ రవాణా, ఎక్సైజ్ పన్ను ఎగవేతను అరికట్టేందుకు హోలోగ్రామ్ టెండర్లు కీలకం.గత సంవత్సరం ఆగస్టు నుంచే ఈ ప్రక్రియ వేగవంతం చేయాలని మంత్రి సూచించినా, రిజ్వీ కమిటీని పునర్వ్యవస్థీకరించాలని ప్రతిపాదించడమే కాకుండా ఛైర్మన్ పదవి నుంచి తప్పుకున్నారు.

మంత్రిని కాదని ఫైల్‌ను నేరుగా ముఖ్యమంత్రికి పంపడంతో వివాదం ముదిరింది.

23 కంపెనీలు బిడ్లు వేసినా, ప్రక్రియ ముందుకు సాగకపోవడంతో రిజ్వీ చివరికి వీఆర్ఎస్ దరఖాస్తు చేసుకున్నారు.

బీఆర్‌ఎస్ మండిపాటు – “అధికారులను వేధిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం”ఈ పరిణామంపై ప్రతిపక్ష బీఆర్‌ఎస్ తీవ్రంగా స్పందించింది.“కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులు అవినీతి సొమ్ము పంచుకోవడంలో విభేదిస్తున్నారు. నిజాయతీ అధికారులు వారి ఆదేశాలకు లోబడకపోతే వేధిస్తున్నారు,” అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.

“రిజ్వీ లాంటి అధికారులు అక్రమాలకు భాగస్వాములు కాబోరని తెలుసు. అందుకే కొందరు పదవుల నుంచి తప్పుకుంటున్నారు,” అని ఆయన అన్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *