IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌కు ముందుగా జట్లు తమ సన్నాహాలు ప్రారంభించాయి. డిసెంబర్ 13 నుంచి 15 మధ్య మినీ వేలం జరిగే అవకాశముండగా, నవంబర్ 15 లోపు అన్ని జట్లు తమ రిటెన్షన్, రిలీజ్ జాబితాలను సమర్పించాలి. ఈ నేపథ్యంలో కొన్ని ఫ్రాంచైజీలు ఆటగాళ్లతో పాటు సహాయక సిబ్బందిలో కూడా మార్పులు చేస్తున్నాయి.
తాజాగా పంజాబ్ కింగ్స్ తమ కోచింగ్ బృందంలో పెద్ద మార్పు చేసింది. మాజీ భారత క్రికెటర్ సాయిరాజ్ బహుతులేను జట్టులో కొత్త స్పిన్ బౌలింగ్ కోచ్‌గా నియమించింది. ఇప్పటివరకు ఆ బాధ్యతలు నిర్వర్తించిన సునీల్ జోషి స్థానంలో బహుతులే బాధ్యతలు చేపట్టారు.
బహుతులే అనుభవం పంజాబ్‌కు బలంగా మారనుంది
దేశీయ క్రికెట్‌లో సాయిరాజ్ బహుతులేకు మంచి అనుభవం ఉంది. గతంలో రాజస్థాన్ రాయల్స్ స్పిన్ బౌలింగ్ కోచ్‌గా సేవలందించిన ఆయన, బెంగాల్, కేరళ, విదర్భ, గుజరాత్ జట్లకు కూడా కోచింగ్ ఇచ్చారు. యువ బౌలర్ల ప్రతిభను వెలికితీయడంలో, టెక్నిక్ మెరుగుపరచడంలో ఆయనకు మంచి పేరు ఉంది.
“పంజాబ్‌లో చేరడం ఎంతో ఉత్సాహంగా ఉంది”
బహుతులే మాట్లాడుతూ, “పంజాబ్ కింగ్స్‌లో చేరడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ జట్టులో ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నారు. వారితో కలిసి పని చేసి, జట్టు విజయానికి నా వంతు సాయం చేయడానికి ఎదురుచూస్తున్నాను” అని అన్నారు.
ఇది కూడా చదవండి: Kavita: సుప్రీంకోర్టుకు కవిత లేఖ – తెలంగాణ గ్రూప్–1 పరీక్ష రద్దు డిమాండ్
సీఈఓ సతీష్ మీనన్ స్పందన
పంజాబ్ కింగ్స్ సీఈఓ సతీష్ మీనన్ మాట్లాడుతూ, “మా జట్టుకు సునీల్ జోషి చేసిన కృషికి కృతజ్ఞతలు. సాయిరాజ్ బహుతులే మా కోచింగ్ బృందంలో చేరడం సంతోషంగా ఉంది. ఆయన అనుభవం, స్పిన్ బౌలర్లపై అవగాహన జట్టుకు విలువైనదిగా ఉంటుంది” అని తెలిపారు.
ఫైనల్ టచ్‌కు సన్నాహాలు
ప్రస్తుతం బహుతులే, హెడ్ కోచ్ రికీ పాంటింగ్ నేతృత్వంలోని కోచింగ్ గ్రూప్‌లో చేరారు. ఐపీఎల్ 2025లో శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో పంజాబ్ కింగ్స్ ఫైనల్ వరకు చేరినా, ఆర్‌సీబీ చేతిలో కేవలం 6 పరుగుల తేడాతో ఓడిపోయింది. కొత్త సీజన్‌లో ఆ లోటును పూడ్చి, టైటిల్ దిశగా పంజాబ్ దూసుకెళ్లేందుకు ఈ మార్పులు దోహదపడనున్నాయి.