ICC Women’s ODI World Cup 2025: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో ఈ రోజు (అక్టోబర్ 22) అభిమానుల దృష్టిని ఆకర్షించే కీలక పోరు జరగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా మహిళల జట్టు, పాత ప్రత్యర్థి ఇంగ్లండ్ మహిళల జట్టుతో తలపడనుంది. క్రికెట్ చరిత్రలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పోరాటాలలో ఒకటైన ‘యాషెస్’ రైవలరీకి ప్రసిద్ధి చెందిన ఈ రెండు జట్లు మరోసారి హోల్కర్ క్రికెట్ స్టేడియం వేదికగా అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:00 గంటలకు ప్రారంభమవుతుంది. ఇప్పటికే ఈ రెండు జట్లు సెమీఫైనల్‌కు చేరుకున్నప్పటికీ, లీగ్ దశలో అగ్రస్థానం కోసం ఈ మ్యాచ్ కీలకం కానుంది. ప్రపంచకప్‌లో ఇప్పటివరకు ఇరు జట్లు అజేయంగా దూసుకెళ్తున్నాయి. ఈ టోర్నీలో తమ అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తూ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. అయితే, ఇంగ్లండ్‌తో పోలిస్తే మెరుగైన నెట్ రన్ రేట్ కారణంగా ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉంది.
Also Read: BCCI: ఆసియా కప్ ఇచ్చేయాలి.. మొహ్సిన్ నఖ్వీ కి బీసీసీఐ హెచ్చరిక
ఇంగ్లండ్ పటిష్టమైన బౌలింగ్ విభాగంతో పాటు కెప్టెన్ నాట్ సీవర్-బ్రంట్ సారథ్యంలో నిలకడైన ఆటతీరు కనబరుస్తోంది. ఈమ్యాచ్‌కు ముందు ఆస్ట్రేలియా జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు రెగ్యులర్ కెప్టెన్, ఇన్-ఫామ్ ఓపెనర్ అలీసా హీలీ (Alyssa Healy) కండరాల గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమైంది. ఈ టోర్నమెంట్‌లో ఆమె ఇప్పటికే భారత్, బంగ్లాదేశ్‌లపై అద్భుత సెంచరీలు చేసింది. అలీసా హీలీ గైర్హాజరీలో వైస్-కెప్టెన్ తాలియా మెక్‌గ్రాత్ జట్టును నడిపించనుంది. హీలీ స్థానంలో 22 ఏళ్ల యువ ఓపెనర్ జార్జియా వాల్ (Georgia Voll) జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. వికెట్ కీపింగ్ బాధ్యతలను బెత్ మూనీ తీసుకోనుంది. మహిళల వన్డే క్రికెట్‌లో ఆస్ట్రేలియా ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటివరకు జరిగిన 89 వన్డే మ్యాచ్‌లలో ఆస్ట్రేలియా 61 విజయాలు నమోదు చేయగా, ఇంగ్లండ్ 24 విజయాలు సాధించింది. అయితే, ప్రపంచకప్ వేదికపై ఈ ఇరు జట్ల మధ్య పోటీ ఎప్పుడూ ఉత్కంఠభరితంగా ఉంటుంది. టోర్నీలో తమ అజేయ రికార్డును కొనసాగించడానికి, పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని పదిలపరుచుకోవడానికి ఈ రెండు శక్తివంతమైన జట్లు ఈ రోజు హోరాహోరీగా తలపడనున్నాయి.