Crime News: గజదొంగ.. దొంగలకే దొంగ.. ఆరితేరిన దొంగ.. ఇలా దొంగతనాలను బట్టి వాడి తెలివితేటలతో జనం ఇలా పేర్లు పెడుతూ ఉంటారు. అంటే ఇతర దొంగల కంటే అతి తెలివిని ప్రదర్శిస్తూ ఉండే దొంగలన్నమాట. ఇలా ప్రత్యేకతలు కలిగిన వారు కొందరు తమ తెలివితేటలతో అలివిగాని చోట దొంగతనాలు చేస్తూ, ఎవరికీ దొరకకుండా చోరీలు చేస్తూ ఉంటారు. ఇక్కడా ఆ దొంగకు వచ్చిన ఓ ఐడియా.. వాడి దొంగతనానికి సులువు అయింది.
ఇదే అదునుగా తరచూ దొంగతనం చేస్తుండసాగాడు. అయితే అక్కడి నగదు కనిపించకుండా పోతుండటంతో అక్కడివారికి అనుమానం కలిగింది. దొంగను పసిగట్టేందుకు అక్కడి వారికీ వచ్చిన ఐడియా దొంగ అతి తెలివి దొంగతనాన్ని పసిగట్టేలా చేసింది. ఇలా దొంగ అతి తెలివికి, ఆ దొంగతనాన్ని పసిగట్టేందుకు ప్రతిగా చేసిన ఐడియా అదిరింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిధిలోని వీరవాసరం మండలం తోకలపూడి వేంకటేశ్వరస్వామి ఆలయంలోని హుండీలోని భక్తులు వేసే నగదు తరచూ మాయమైతుంది. ఆలయ వరండాలో ఉండటంతో దొంగల పనై ఉంటుందని ఆలయ నిర్వాహకులు ఓ పనిచేశారు. అంతకు ముందు ఆలయంలో ఎలాంటి సీసీ కెమెరాలు లేవు. దీంతో దొంగతనం ఎవరు చేస్తున్నారో తెలియలేదు. కానీ, ఆ తాజాగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో ఆ దొంగతనం స్పష్టంగా రికార్డయింది. కానీ, ఆ దొంగ అతి తెలివిని చూసి అవాక్కవడం వారి వంతయింది.
ఆ ఆలయ హుండీలోని నగదును ఆ కేటుగాడు చాకచక్యంగా తీయడం ఆ సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయింది. ఓ వైరు కొనకు బబుల్గమ్ అంటించి హుండీలోకి జారిచ్చి, దానికి నగదు అంటుకోగానే బయటకు లాగేవాడు. అలా పలుమార్లు నగదును బయటకు తీయడం కెమెరాల్లో రికార్డయింది. ఎవరూ చూడటం లేదనుకొని ఎంచక్కా ఆ నగదును చోరీ చేయసాగాడు. అందుకే తాడిని తన్నేవాడొకడుంటే.. వాడి తలదన్నేవాడు ఒకడుంటాడని సామెత వచ్చింది. వాడి ముఖం కెమెరాల్లో స్పష్టమైంది. దీంతో ఆలయ నిర్వాహకులు చోరీపై పోలీసులను ఆశ్రయించారు. వాడు ఎక్కడున్నా దొరకబట్టుకునే అవకాశం ఉన్నది.