France: ఫ్రాన్స్ రాజకీయాల్లో పెను సంచలనం చోటు చేసుకుంది. ఆ దేశ మాజీ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీ అరుదైన, చెత్త రికార్డును మూటగట్టుకోబోతున్నారు. ఫ్రెంచ్ చరిత్రలో ఐదేళ్ల జైలు శిక్ష అనుభవించనున్న తొలి దేశ నాయకుడిగా ఆయన నిలవనున్నారు. సర్కోజీకి విధించిన శిక్ష పారిస్‌లోని లా శాంటే జైలులో మంగళవారం (అక్టోబర్ 21) నుంచి ప్రారంభం కానుంది.
లిబియా నిధుల కేసులో శిక్ష
2007లో జరిగిన తన అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా లిబియా దేశం నుంచి చట్టవిరుద్ధంగా నిధులు స్వీకరించి నేరపూరిత కుట్రకు పాల్పడ్డారన్న ఆరోపణలపై పారిస్ కోర్టు సర్కోజీకి శిక్ష ఖరారు చేసింది. తనపై వచ్చిన ఆరోపణలను సర్కోజీ బలంగా ఖండిస్తున్నప్పటికీ, అప్పీల్ విచారణకు సమయం ఇవ్వకుండానే శిక్షను వెంటనే ప్రారంభించాలని కోర్టు చారిత్రక తీర్పునిచ్చింది. కోర్టు అభిప్రాయం ప్రకారం, సర్కోజీ చేసిన నేరం ప్రజా శాంతికి తీవ్ర అంతరాయం కలిగించింది.
లా శాంటే జైలులో VIP విభాగం
భద్రతా కారణాల దృష్ట్యా మాజీ అధ్యక్షుడు సర్కోజీని ఏకాంత నిర్బంధంలో ఉంచాలని ఆయన కోరారు. న్యాయ మంత్రి జెరాల్డ్ డార్మానిన్ ఈ విషయాన్ని ధృవీకరిస్తూ, సర్కోజీ లా శాంటే జైలులోని “VIP విభాగం” అని పిలిచే ప్రత్యేక ప్రాంతంలో ఉంటారని తెలిపారు. ఈ విభాగం సాధారణ ఖైదీల నుంచి వేరుగా ఉంటుంది. ఇందులో దాదాపు 9 చదరపు మీటర్ల (97 చదరపు అడుగులు) విస్తీర్ణం గల 18 ఒకే విధమైన గదులు ఉంటాయి.
1867లో ప్రారంభించబడిన ఈ జైలు గతంలో కూడా కెప్టెన్ ఆల్ఫ్రెడ్ డ్రేఫస్, వెనిజులా ఉగ్రవాది కార్లోస్ ది జాకల్ వంటి అనేక మంది ప్రముఖ ఖైదీలకు ఆతిథ్యం ఇచ్చింది. అయితే, ఇటీవలి సంవత్సరాలలో ఈ జైలును పూర్తిగా పునరుద్ధరించారు.
సర్కోజీ సవాల్, ఆత్మవిశ్వాసం
తనపై వచ్చిన ఆరోపణలను ఖండించిన సర్కోజీ, అప్పీలు పెండింగ్‌లో ఉన్నా తనను జైలుకు పంపాలనే నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. “నేను జైలుకు భయపడను. లా శాంటేలోని జైలు గేట్ల ముందు కూడా నా తల పైకెత్తి నిలబడతాను. చివరి శ్వాస వరకు నేను పోరాడతాను” అని ఆయన ఒక పత్రికతో మాట్లాడుతూ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు.
రిపోర్టుల ప్రకారం, 70 ఏళ్ల సర్కోజీ ఇప్పటికే తన జైలు జీవితానికి సిద్ధపడ్డారు. తన జైలు సంచిలో దుస్తులు, కుటుంబానికి చెందిన 10 ఛాయాచిత్రాలు, అలాగే ‘ది కౌంట్ ఆఫ్ మోంటే క్రిస్టో’ (రెండు సంపుటాలు) మరియు యేసుక్రీస్తు జీవిత చరిత్ర వంటి మూడు పుస్తకాలు తీసుకువెళ్తున్నారని సమాచారం. (ది కౌంట్ ఆఫ్ మోంటే క్రిస్టో నవలలో కథానాయకుడు జైలు నుంచి తప్పించుకుని ప్రతీకారం తీర్చుకుంటాడు).
కోర్టు నిబంధనల ప్రకారం, సర్కోజీ జైలుకు చేరుకున్న తర్వాతే విడుదల కోసం అప్పీల్ కోర్టులో అభ్యర్థన దాఖలు చేయగలరు. ఈ అభ్యర్థనను పరిశీలించడానికి న్యాయమూర్తులకు రెండు నెలల సమయం ఉంటుంది.