Toll Plaza: దీపావళి పండుగ సందర్భంగా బోనస్ వస్తుందని ఆశగా ఎదురుచూసిన ఉద్యోగులకు చివరి నిమిషంలో నిరాశే ఎదురైంది. అకౌంట్లలో బోనస్ పడకపోవడంతో ఆగ్రహించిన టోల్ ప్లాజా ఉద్యోగులు విధులను పక్కనపెట్టి నిరసనకు దిగారు. అంతేకాదు, వాహనాలు ఉచితంగా వెళ్లిపోయేలా టోల్ గేట్లను పూర్తిగా ఎత్తేశారు. దీంతో ఒక్కసారిగా కలవరపడిన యాజమాన్యం రంగంలోకి దిగి కాళ్ళబేరానికి వచ్చింది.
10 గంటలు ఫ్రీ టోల్:
ఈ సంఘటన ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై ఉన్న ఫతేహాబాద్ టోల్ ప్లాజా వద్ద జరిగింది. ఈ ఎక్స్‌ప్రెస్‌వే జాతీయ రాజధాని ఢిల్లీకి అనుసంధానం చేస్తుంది.
దీపావళి సందర్భంగా టోల్ ఆపరేటర్లకు బోనస్ ఇస్తామని యాజమాన్యం ముందుగా హామీ ఇచ్చింది. తీరా చూస్తే, పండుగ వచ్చినా బోనస్ అందలేదు. దీంతో చిర్రెత్తుకొచ్చిన టోల్ ఆపరేటర్లు వెంటనే ఆందోళనకు దిగారు.
నిరసన ప్రారంభం కావడంతో యాజమాన్యం వేరే ఉద్యోగులను రప్పించే ప్రయత్నం చేసింది. కానీ, ఆందోళన చేస్తున్న ఆపరేటర్లు వారిని పని చేయకుండా అడ్డుకున్నారు. చేసేదేమీ లేక, యాజమాన్యం బోనస్ ఇస్తామని లిఖితపూర్వక హామీ ఇవ్వడంతో ఉద్యోగులు శాంతించి విధుల్లోకి తిరిగి వచ్చారు.
ఆదివారం నాడు దాదాపు 10 గంటల పాటు టోల్ గేట్లు ఎత్తేయడం వల్ల కేంద్ర ప్రభుత్వానికి లక్షల రూపాయల నష్టం వాటిల్లినట్లు సమాచారం.
ఉద్యోగుల ఆవేదన:
బోనస్ అందక నిరసన తెలిపిన ఉద్యోగుల్లో ఒకరు తమ ఆవేదనను ఇలా పంచుకున్నారు:
“నేను గత ఏడాది నుంచి ఈ కంపెనీలో పనిచేస్తున్నాను. కానీ, వారు మాకు ఇప్పటివరకు ఎటువంటి బోనస్ ఇవ్వలేదు. మేము చాలా కష్టపడి పని చేస్తున్నాం. జీతాలు కూడా సకాలంలో ఇవ్వడం లేదు.”
“ఇప్పుడు కంపెనీ కొత్త సిబ్బందిని తీసుకుంటామని చెబుతోంది కానీ, మాకు రావలసిన బోనస్ మాత్రం ఇవ్వడం లేదు” అని ఉద్యోగి వాపోయారు. ఉద్యోగుల కష్టం, వారి వేదన అర్థం చేసుకోకుండా కేవలం లాభాల కోసం పనిచేస్తున్న కంపెనీ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

