DCO Arrested: మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఏసీబీ అధికారులు శనివారం (అక్టోబర్ 25) పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో జిల్లా సహకార శాఖ అధికారి (డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్) రాథోడ్ బిక్కును లంచం తీసుకుంటున్న సమయంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. సస్పెండ్ అయిన ఉద్యోగి పెండింగ్ వేతనాల మంజూరుకు రాథోడ్ రూ. 8 లక్షలు లంచం కోరినట్లు సమాచారం. ఇందులో భాగంగా మొదటి విడతగా రూ. 2 లక్షలు ఇవ్వాలని ఒప్పందం కుదిరింది. బాధితుడు ఈ విషయం ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో, అధికారులు ముందస్తుగా వ్యూహం రచించి, ఇక్బాల్ అహ్మద్ నగర్‌లోని రాథోడ్ నివాసంపై దాడి చేశారు. ఈ దాడిలో రాథోడ్ రూ. 2 లక్షలు లంచం స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
తదుపరి రాథోడ్ బిక్కును అదుపులోకి తీసుకున్న అధికారులు మంచిర్యాల కలెక్టరేట్‌లో విచారణ చేపట్టారు. అదనంగా, ఆసిఫాబాద్ జిల్లా ఇచ్చోడలోని అతని స్వగృహంలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. రాథోడ్ ఆసిఫాబాద్ జిల్లా ఇన్‌ఛార్జిగా కూడా విధులు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ ఘటనతో జిల్లా అధికారుల్లో కలకలం రేగింది. ప్రభుత్వ అధికారులు లంచం కోరిన సందర్భంలో ప్రజలు ఎటువంటి భయం లేకుండా ఏసీబీకి ఫిర్యాదు చేయాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఏసీబీ సూచన..
లంచం డిమాండ్ చేసిన ప్రభుత్వ ఉద్యోగులపై ప్రజలు 1064 హెల్ప్‌లైన్ నంబర్ ద్వారా లేదా సమీప ఏసీబీ కార్యాలయాన్ని సంప్రదించి ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.

