Cargo Plane Crashes: హాంకాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయం (Hong Kong International Airport)లో సోమవారం తెల్లవారుజామున పెను ప్రమాదం చోటుచేసుకుంది. ఒక భారీ కార్గో విమానం రన్‌వే నుంచి అదుపు తప్పి సముద్రంలోకి జారి పడింది. ఈ దుర్ఘటనలో విమానాశ్రయానికి చెందిన ఇద్దరు గ్రౌండ్ సిబ్బంది మృతి చెందగా, విమానంలో ఉన్న సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు.
ల్యాండింగ్ సమయంలోనే ప్రమాదం
స్థానిక మీడియా నివేదికల ప్రకారం, టర్కీకి చెందిన ఎయిర్ ACT ఎయిర్‌లైన్‌కు చెందిన ఈ విమానం, ఎమిరేట్స్ EK9788 ఫ్లైట్ నంబర్‌తో దుబాయ్ నుంచి హాంకాంగ్‌కు వచ్చింది. బోయింగ్ 747-481 మోడల్‌కి చెందిన ఈ కార్గో విమానం స్థానిక సమయం ప్రకారం ఉదయం 3:50 గంటలకు ల్యాండ్ అవుతున్న సమయంలో రన్‌వేపై ఉన్న ఒక వాహనాన్ని ఢీకొని, అనంతరం సముద్రంలోకి జారిపోయింది.
మృతి చెందిన గ్రౌండ్ సిబ్బంది
సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ (Civil Aviation Department) తెలిపిన వివరాల ప్రకారం.. ప్రమాద సమయంలో రన్‌వేపై పనిచేస్తున్న ఇద్దరు గ్రౌండ్ సిబ్బంది గాయాలతో సముద్రంలో పడిపోయారు. వెంటనే వారిని రక్షించి ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ మృతి చెందారు. అయితే, విమానంలో ఉన్న నలుగురు సిబ్బంది మాత్రం ప్రాణాపాయం నుంచి బయటపడి, చికిత్స కోసం ఆసుపత్రిలో చేరారు.
ప్రమాదం జరిగిన రన్‌వేను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. అయితే, విమానాశ్రయంలోని మిగతా రెండు రన్వేలలో కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతున్నాయి.
రక్షణ చర్యలు, దర్యాప్తు ప్రారంభం
ప్రమాదం జరిగిన వెంటనే హాంకాంగ్ ప్రభుత్వం రక్షణ చర్యల కోసం హెలికాప్టర్లు, అగ్నిమాపక నౌకలను సంఘటనా స్థలానికి పంపింది. ఈ ఘటన కారణంగా భద్రతా కారణాల దృష్ట్యా కనీసం 11 కార్గో విమానాల రాకపోకలను రద్దు చేశారు.
భద్రతా పరంగా అత్యుత్తమ రికార్డు కలిగిన హాంకాంగ్ విమానాశ్రయంలో ఇలాంటి తీవ్రమైన ఘటనలు జరగడం చాలా అరుదు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా, ఈ ఘటనపై ఎమిరేట్స్ సంస్థ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.