Salman Khurshid: కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ కేంద్ర మంత్రి అయిన సల్మాన్ ఖుర్షీద్‌కు ఎంతో ప్రతిష్టాత్మకమైన ‘రాజీవ్ గాంధీ సద్భావన అవార్డు’ దక్కింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అవార్డును ఖుర్షీద్‌కు అందించారు.
ఈ రోజు చార్మినార్ దగ్గర జరిగిన రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర గుర్తుచేసుకునే కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ అవార్డును సల్మాన్ ఖుర్షీద్‌కు ఇచ్చారు.
అవార్డు అందుకుని ఉద్వేగం: అవార్డు తీసుకున్న తర్వాత సల్మాన్ ఖుర్షీద్ మాట్లాడుతూ చాలా సంతోషాన్ని వ్యక్తపరిచారు. “ఈ అవార్డు నాకు వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఇది నాకు చాలా ప్రత్యేకమైనది. నా జీవితంలో దీనికంటే గొప్ప అవార్డు మరొకటి లేదు,” అని ఆయన అన్నారు.
రాజీవ్, రాహుల్ గాంధీ లక్ష్యాలు: రాజీవ్ గాంధీ మన దేశాన్ని ఒకేతాటిపై నిలపడానికి ఈ యాత్ర చేశారని, ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా అదే దారిలో నడుస్తున్నారని ఖుర్షీద్ గుర్తుచేశారు. “రాహుల్ గాంధీ ఆలోచనలు, ఆశయాలు ఆ దేవుడు నెరవేర్చాలని కోరుకుంటున్నాను,” అని ఆకాంక్షించారు.
సామాజిక ఐక్యతపై సందేశం: ప్రస్తుత సమాజంలో జరుగుతున్న కొన్ని సంఘటనలపై ఖుర్షీద్ ఆవేదన వ్యక్తం చేశారు. “ఈ రోజు దేశంలో మనం చూడకూడనివి ఎన్నో చూస్తున్నాము. హిందూ రైతు పండించిన పంటను ముస్లిం తినొచ్చు, ముస్లిం పండించిన పంటను హిందూ తినొచ్చు. అది మన శరీరంలో రక్తంగా మారుతుంది. రక్తానికి గ్రూప్‌లు ఉంటాయి, కానీ అది హిందూ రక్తం, ముస్లిం రక్తం అని తెలియదు కదా,” అని ఆయన ప్రశ్నించారు.
అయినా కూడా సమాజంలో కొన్ని చెడు సంఘటనలు చూస్తున్నామని, వింటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అవార్డు ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.