Ponnam Prabhakar

Ponnam Prabhakar: మా బాధ్యత పూర్తి చేశాం.. ఇక కేంద్రం చేతుల్లోనే!

Ponnam Prabhakar: తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాల (బీసీ) రిజర్వేషన్లపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీ రిజర్వేషన్లను 42 శాతం పెంచే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది చేసిందని, ఇక ఆలస్యం చేయకుండా కేంద్రం వెంటనే నిర్ణయం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

మా ప్రయత్నం ఇదే: మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. “తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు ముందుగా రాష్ట్రమంతా కుల సర్వే నిర్వహించింది. ఆ తర్వాత శాసనసభలో చట్టం చేసి దాన్ని గవర్నర్ ఆమోదం కోసం పంపాం. ప్రస్తుతం ఆ బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉంది” అని తెలిపారు. మార్చి 30 నుంచి గవర్నర్ వద్దకు వెళ్ళిన బిల్లులు ఇప్పటి వరకు ఆమోదం పొందలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

నిధులు రాక ఇబ్బందులు: “గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగకపోవడం వల్ల గత రెండేళ్లుగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోయాయి. దీంతో ఇబ్బందులు పడుతున్నాం. అన్ని రాజకీయ పార్టీల మద్దతుతోనే ఈ రిజర్వేషన్ బిల్లులు పాస్ చేసుకున్నాం” అని మంత్రి వివరించారు.

కేంద్రం ఆలస్యం చేస్తోంది: నిర్ణయం తీసుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం దీనిపై మౌనంగా ఉండటం, తదుపరి చర్యలు తీసుకోకపోవడం వల్లే రిజర్వేషన్ల అమలులో జాప్యం జరుగుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు.

న్యాయ పోరాటం చేస్తాం: “మేము న్యాయస్థానాల్లో పోరాటాలు చేస్తాం. హైకోర్టులో అఫిడవిట్ కూడా దాఖలు చేస్తాం” అని మంత్రి స్పష్టం చేశారు. బలహీన వర్గాల తరఫున అన్ని రకాల పోరాటాలు చేసే సందర్భంలోనే తెలంగాణ బలహీన వర్గాల జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) ఏర్పడి బంద్‌కు పిలుపునిచ్చిందని, వారికి ఆయన అభినందనలు తెలిపారు.

బీజేపీ నేతలకు విజ్ఞప్తి: ఈ బంద్ ప్రశాంతంగా జరుగుతోందని చెప్పిన మంత్రి పొన్నం ప్రభాకర్, బీజేపీ ఎంపీలైన బండి సంజయ్, కిషన్ రెడ్డిలకు ముఖ్యంగా విజ్ఞప్తి చేశారు.

“బండి సంజయ్, కిషన్ రెడ్డి గారు, బీజేపీ ఎంపీలంతా తెలంగాణ బలహీన వర్గాల ప్రజల ఆకాంక్షలను కేంద్రానికి చెప్పే ప్రయత్నం చేయండి. రిజర్వేషన్లు అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా బలహీన వర్గాలకు న్యాయం చేసిన రాష్ట్రంగా, మీ నాయకత్వంలోనే వీటిని ఇచ్చే ప్రయత్నం చేయండి. లేదంటే తెలంగాణ ప్రజల ముందు దోషిగా నిలబడాల్సి వస్తుంది” అని పొన్నం హెచ్చరించారు.

“కేంద్రంలో బాధ్యత మీదే. రాష్ట్రంలో చేయాల్సిన బాధ్యతను మేము నిర్వర్తించాం. నిర్ణయం తీసుకోవాల్సిన కేంద్రం ఎలాంటి ఆలస్యం చేయకుండా వెంటనే నిర్ణయం తీసుకోవాలి. ఏ న్యాయస్థానంలో అయినా వాదనలు వినిపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. బంద్‌లో పాల్గొన్న ప్రజలందరికీ ధన్యవాదాలు” అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ తన వ్యాఖ్యలను ముగించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *