BC Bandh:బీసీ రిజర్వేషన్ల అమలు కోరుతూ బీసీ సంఘాల జేఏసీ పిలుపుమేరకు శనివారం (అక్టోబర్ 18) రాష్ట్రవ్యాప్తంగా బంద్ కొనసాగుతున్నది. రాష్ట్రంలోని అన్ని పార్టీలు, వివిధ కుల, ప్రజాసంఘాలు మద్దతుగా నిలిచాయి. అయితే హైదరాబాద్ నగరం సహా పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బంద్ పాటించని చోట్ల నిరసనకారులు దాడులకు దిగిన ఘటనలు అక్కడక్కడా చోటు చేసుకున్నాయి.
BC Bandh:హైదరాబాద్ నగరంలోని నల్లకుంట పరిధిలో బీసీ బంద్ నేపథ్యంలో బజాజ్ ఎలక్ట్రానిక్ షోరూం, రాఘవేంద్ర టిఫిన్ సెంటర్‌ను తెరిచారు. ఈ విషయం తెలిసిన నిరసనకారులు ఆయా భవనాలపై రాళ్లు రువ్వారు. బంద్‌కు పిలుపునిచ్చినా ఎలా తెరుస్తారంటూ ఆయా దుకాణాల నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు. దీతో ఆయా షోరూంలను మూసివేశారు.
BC Bandh:అదే విధంగా హైదరాబాద్ నల్లకుంట ఫీవర్ ఆసుప్రతి పరిధిలోని ఓ పెట్రోల్ బంక్ తెరిచి ఉంచడంతో నిరసనకారులు ఆందోళన వ్యక్తంచేశారు. బంక్‌పై తీవ్రస్థాయిలో దాడికి దిగారు. దీంతోపాటు కరీంనగర్ పట్టణంలో తెరిచి ఉంచిన ఓ హోటల్‌లో సామగ్రిని నిరసనకారులు విసిరిపడేశారు. ఇలాంటి చిన్నపాటి ఉద్రిక్త పరిస్థితుల నడుమ బంద్ సంపూర్ణంగా కొనసాగతున్నది.
బంద్ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా వ్యాపార, వాణిజ్య సముదాయాలను మూసి ఉంచారు. రాష్ట్రమంతా ఆర్టీసీ బస్సులు బయటకు రాలేదు. బస్సులు బయటకు రానీయకుండా డిపోలు ఎదుట నిరసన కారులు ఆందోళనకు దిగారు. బీసీ నేతలతోపాటు వివిధ పార్టీల నేతలు జెండాలు చేతబట్టుకొని దుకాణాలను మూసి వేయిస్తున్నారు.