Rain Alert: మన తెలంగాణతో పాటు భారతదేశం నుంచి నైరుతి రుతుపవనాలు పూర్తిగా వీడ్కోలు పలికేశాయి. ఇకపై ఈశాన్య రుతుపవనాలు దక్షిణ భారతదేశంలోకి ప్రవేశించాయి. దీని ప్రభావం కారణంగానే రానున్న మూడు రోజులు ఆంధ్రప్రదేశ్ (ఏపీ), తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు పడనున్నాయి. దక్షిణ, మధ్య బంగాళాఖాతంలో తూర్పు, ఈశాన్య దిశల నుంచి గాలులు బలంగా వీస్తున్నాయి.
ఏపీలో వర్ష సూచన
ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాలకు వర్ష హెచ్చరిక జారీ చేసింది వాతావరణ శాఖ. ముఖ్యంగా ఈ రోజు (నేడు) ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
అలాగే, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, ముఖ్యంగా పొలాల్లో పనులు చేసే రైతులు, పశువుల కాపరులు పిడుగుల పడే ప్రమాదం ఉన్నందున జాగ్రత్తలు తీసుకోవాలి.
తెలంగాణలో మూడు రోజులు వానలు
తెలంగాణపై కూడా ఈశాన్య రుతుపవనాల ప్రభావం ఉంది. దీని కారణంగా రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ అధికారులు తెలిపారు.
ఈ రోజు (నేడు) వర్షాలు పడే జిల్లాలు:
ఖమ్మం, వరంగల్, మెదక్, నల్గొండ, కామారెడ్డి ఉమ్మడి జిల్లాల పరిధిలోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది.
రేపు (మరుసటి రోజు) వర్షాలు పడే జిల్లాలు:
నిజామాబాద్, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు పడతాయని అంచనా.
వాతావరణ మార్పుల దృష్ట్యా ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని, వానా కాలం పోయిందనుకోవద్దు… ఈశాన్య రుతుపవనాల వల్ల మరోసారి జల్లులు పలకరించనున్నాయి.