Chandrababu Naidu: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాటల మనిషి కాదని, పని చేసి చూపించే నాయకుడని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ‘సూపర్ జీఎస్టీ.. సూపర్ సేవింగ్స్’ బహిరంగ సభలో పాల్గొన్న చంద్రబాబు, ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు.
మోదీ: మన భవిష్యత్తును కాపాడే నాయకుడు
నరేంద్ర మోదీ మనందరి భవిష్యత్తును కాపాడే గొప్ప నాయకుడని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఆయన గత 25 ఏళ్లుగా దేశం కోసం అద్భుతంగా పనిచేస్తున్నారని, రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారని కొనియాడారు. “నా రాజకీయ జీవితంలో ఎంతో మంది ప్రధానమంత్రులతో కలిసి పనిచేశాను. కానీ, మోదీ లాంటి వ్యక్తిని ఇప్పటివరకు చూడలేదు. ఆయన మాటలు చెప్పరు, చేతల్లో చేసి చూపిస్తారు” అని చంద్రబాబు స్పష్టం చేశారు.
Also Read: Nara Lokesh: ప్రధాని మోడీపై నారా లోకేశ్ ప్రశంసలు
జీఎస్టీతో సామాన్యులకు మేలు
మోదీ తెచ్చిన జీఎస్టీ (వస్తు, సేవల పన్ను) సంస్కరణల వల్ల సామాన్య ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని చంద్రబాబు తెలిపారు. ఈ ‘సూపర్ జీఎస్టీ’తో ‘సూపర్ సేవింగ్’ సాధ్యమవుతుందన్నారు. “ప్రతి కుటుంబానికి జీఎస్టీ ద్వారా ఏడాదికి దాదాపు రూ.15 వేలు ఆదా అవుతుంది” అని ఆయన వివరించారు. ‘వన్ నేషన్, వన్ ట్యాక్స్, వన్ మార్కెట్’ అనే లక్ష్యంతో ఈ పన్ను విధానం వచ్చిందని, ఇది అన్ని వర్గాల వారికి మేలు చేసే సంస్కరణ అని చంద్రబాబు మోదీకి ధన్యవాదాలు చెప్పారు.
భారత్ ప్రపంచ శక్తిగా ఎదుగుతుంది
ప్రధాని మోదీ తీసుకున్న చర్యల వల్లే భారతదేశం ప్రపంచ స్థాయిలో తన శక్తిని నిరూపించుకోగలిగిందని చంద్రబాబు అన్నారు. “ఆపరేషన్ సింధూర్‌తో మన శక్తి ఏంటో మోదీ ప్రపంచానికి చూపించారు. రాబోయే వంద సంవత్సరాలకు మోదీ గట్టి పునాది వేశారు” అని ఆయన నొక్కి చెప్పారు. మోదీ దార్శనికతతో 2038 నాటికి భారతదేశం ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక శక్తిగా మారుతుందని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు. సరైన సమయంలో దేశానికి మోదీ లాంటి నాయకుడు దొరకడం మన అదృష్టం అని చంద్రబాబు తన ప్రసంగాన్ని ముగించారు.