Konda Murali: తెలంగాణ మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ వ్యవహారంపై ఆమె భర్త, కాంగ్రెస్ నాయకులు కొండా మురళి స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, తమ కుటుంబానికి మధ్య ఎలాంటి గొడవలు లేవని ఆయన స్పష్టం చేశారు. ఈ సమస్యకు త్వరలోనే ముగింపు పలుకుతానని చెప్పారు.
‘ఓఎస్డీ’ విషయం నాకు తెలీదు:
హనుమకొండలో కొండా మురళి బుధవారం మీడియాతో మాట్లాడారు. మంత్రి సురేఖ కార్యాలయానికి తాను ఒక్కసారే వెళ్ళానని, అక్కడ ఏం జరుగుతుందో తనకు తెలియదన్నారు. సుమంత్ వ్యవహారం గురించి కూడా తనకు పూర్తిగా తెలియదని చెప్పారు.
రేవంత్ రెడ్డి మా ‘వైఎస్ఆర్’:
Also Read: Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. బీఆర్‌ఎస్‌కు షాక్ కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు!
సీఎం రేవంత్ రెడ్డి కావాలని తాను, సురేఖ చాలా కష్టపడ్డామని కొండా మురళి గుర్తు చేశారు. వైఎస్ఆర్ తర్వాత మరో వైఎస్ఆర్ రేవంత్ రెడ్డి అని ఆయన పేర్కొన్నారు. తమకు, ముఖ్యమంత్రికి మధ్య ఎలాంటి గొడవలు లేవని, ఎవరైనా కావాలని గొడవలు సృష్టిస్తే తమకు సంబంధం లేదని తేల్చి చెప్పారు.
పోలీసుల తీరుపై స్పందన:
సిమెంట్ కంపెనీ యాజమాన్యాలను బెదిరించిన ఆరోపణలతో సుమంత్‌ను ప్రభుత్వం తొలగించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో, బుధవారం రాత్రి టాస్క్‌ఫోర్స్ పోలీసులు సుమంత్ కోసం మంత్రి సురేఖ ఇంటికి వచ్చారు. దీనిపై మంత్రి కూతురు సుస్మిత అడ్డుకోవడం, పోలీసులతో వాగ్వాదం చేయడం జరిగింది. ఈ విషయంపై కొండా మురళి మాట్లాడుతూ.. “పోలీసులు ఇంటికి ఎందుకు వచ్చారో తెలుసుకుని తగిన విధంగా అడుగులు వేస్తాను. నా కూతురు సుస్మిత ఇబ్బంది పడ్డానని ఇప్పుడే చెప్పింది” అని తెలిపారు.
సమస్యను పరిష్కరిస్తా:
మీడియా ముందు మాట్లాడొద్దని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ చెప్పారని, ఆమె మాట వింటానని కొండా మురళి చెప్పారు. “నేను మంత్రులందరి ఇళ్లకు వెళ్లి మాట్లాడగలను. నన్ను టార్గెట్ చేస్తే వారికే నష్టం. పీసీసీ అధ్యక్షులు, సీఎం రేవంత్ అన్నతో మాట్లాడి ఈ సమస్యను తప్పకుండా పరిష్కరిస్తాను. ఎవరి తప్పు ఉన్నా, ఈ సమస్యకు ఫుల్‌స్టాప్ పడేలా చూస్తా” అని ఆయన భరోసా ఇచ్చారు.
సీఎం రేవంత్ రెడ్డి తనకు ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చారని, తప్పకుండా ఇస్తారని కొండా మురళి నమ్మకం వ్యక్తం చేశారు. మంత్రి సురేఖ ఈ రోజు వరంగల్ తూర్పులో జరిగే సమావేశానికి హాజరవుతారని తెలిపారు.