BC Reservation: తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్‌ఎల్‌పీ)ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. దీంతో, 50 శాతం రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలకు వెళ్లాలని సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
హైకోర్టుకు తదుపరి విచారణ బాధ్యత
అంతేకాకుండా, సుప్రీంకోర్టు తన ఆదేశాలతో సంబంధం లేకుండా రిజర్వేషన్ల అంశంపై తదుపరి విచారణ చేపట్టాలని ధర్మాసనం హైకోర్టుకు సూచించింది. సుప్రీంకోర్టు తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వం తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే దానిపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఈ అంశంపై కొద్దిసేపట్లో జరగనున్న రాష్ట్ర కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఏం జరిగింది?
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీఓ 9పై హైకోర్టు స్టే విధించింది. ఈ స్టేను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పీ దాఖలు చేసింది. గురువారం జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ జరిపింది.
ప్రభుత్వం వాదనలు
రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. రిజర్వేషన్లు 50 శాతం మించకూడదనే అభిప్రాయం సరైంది కాదని ఆయన వాదించారు. తెలంగాణలో ఇంటింటి సర్వే ద్వారా కులగణన సర్వే జరిగిందని, లెక్కలు తేల్చారని సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. రిజర్వేషన్ల పెంపునకు అసెంబ్లీలో అన్ని పార్టీలు ఏకాభిప్రాయం వ్యక్తం చేసినా, బిల్లుపై మూడు నెలలు దాటినా గవర్నర్ నిర్ణయం తీసుకోలేదని సింఘ్వీ వివరించారు.
ప్రతివాది లాయర్ వాదనలు
అయితే, రిజర్వేషన్లు 50 శాతం మించొద్దని కృష్ణమూర్తి జడ్జిమెంట్ వంటి తీర్పులు స్పష్టంగా ఉన్నాయని ప్రతివాది తరఫు లాయర్ గట్టిగా వాదించారు.
సుప్రీంకోర్టు నిర్ణయం
ఇరువైపులా వాదనలు విన్న సుప్రీంకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను తిరస్కరించింది. ఈ అంశం హైకోర్టులో ఇప్పటికే పెండింగ్‌లో ఉన్నందున, తాము విచారణకు స్వీకరించలేమని స్పష్టం చేసింది. ప్రభుత్వం కోరుకుంటే పాత రిజర్వేషన్ల ఆధారంగా స్థానిక ఎన్నికలకు వెళ్లవచ్చని సుప్రీంకోర్టు సూచించింది.