Konda Sushmita

Konda Sushmita: మంత్రి కొండా సురేఖ కుమార్తె సుష్మిత సంచలన వ్యాఖ్యలు

Konda Sushmita: తెలంగాణ అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ నివాసం వద్ద బుధవారం అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అవినీతి ఆరోపణలతో ప్రభుత్వం విధుల నుంచి తొలగించిన ఆమె మాజీ ఓఎస్‌డీ (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ) ఎన్. సుమంత్‌ను అరెస్ట్ చేసేందుకు వరంగల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మఫ్టీలో రావడంతో ఈ పరిణామాలు మొదలయ్యాయి.

మాజీ ఓఎస్‌డీ కోసం అరెస్టు ప్రయత్నం
పీసీబీలో ఓఎస్‌డీగా పనిచేసిన సుమంత్‌పై అధికారులపై ఒత్తిడి తేవడం, కాలుష్య పరిశ్రమల నిర్ణయాల్లో జోక్యం చేసుకోవడం వంటి అవినీతి ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా, డెక్కన్ సిమెంట్ కంపెనీ ఫైలు విషయంలో సుమంత్ తుపాకీతో బెదిరించారనే తీవ్ర ఆరోపణలు రావడంతో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అక్టోబర్ 14న ప్రభుత్వం ఆయన్ను తొలగించింది. సుమంత్ మంత్రి సురేఖ ఇంట్లోనే ఉన్నారనే సమాచారంతో బుధవారం రాత్రి వరంగల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మఫ్టీలో వచ్చి అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు.

అయితే, మంత్రి కుమార్తె కొండా సుస్మిత వారిని గేటు వద్దే అడ్డుకున్నారు. తాము పోలీసులమని చెప్పినా, వారు నిజమైన పోలీసులేనా అని ప్రశ్నిస్తూ సుస్మిత తీవ్ర వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకుని మంత్రి సురేఖ బయటకు రాగానే, ఉద్రిక్తత పెరగడంతో వరంగల్ పోలీసులు వెనక్కి తగ్గారు. అనంతరం మంత్రి సురేఖ సుమంత్‌ను తన కారులో అక్కడి నుంచి తీసుకెళ్లారు.

Also Read: CBI: జగన్ విదేశీ పర్యటనపై కోర్టును ఆశ్రయించిన సీబీఐ

రాజకీయ కుట్ర ఆరోపణలు: ‘బీసీలను తొక్కేస్తున్నారు’
ఈ ఘటన అనంతరం కొండా సుస్మిత మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు.

తమ కుటుంబాన్ని వేధించేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని సుస్మిత ఆరోపించారు. బీసీ మహిళా మంత్రి అయిన తన తల్లి కొండా సురేఖను రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నం జరుగుతోందని, బీసీ మహిళా మంత్రి ఇంటికి పోలీసులను పంపి అవమానించారని విమర్శించారు. “రెడ్లు అంతా ఒక్కటయ్యారు.. బీసీలను తొక్కేస్తున్నారు” అంటూ సామాజిక వర్గాల ఆధారంగా రాజకీయ విమర్శలు చేశారు.

సుమంత్ తుపాకీతో బెదిరించడం అబద్ధమని, సుమంత్ దగ్గర అసలు తుపాకీ లేదని సుస్మిత స్పష్టం చేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బంధువుల ఫిర్యాదు మేరకే కేసు నమోదైందని వేం నరేందర్‌రెడ్డి చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఇందులో కుట్ర ఉందని ఆరోపించారు. ప్రభుత్వంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి సంబంధించిన ఫైల్స్ త్వరగా క్లియర్ అవుతుంటే, తమకు సంబంధించిన ఫైల్స్ మాత్రం నెలలు గడిచినా క్లియర్ కావడం లేదని సుస్మిత వివక్షను ఆరోపించారు.

తమ తల్లిదండ్రులు కొండా సురేఖ, కొండా మురళికి ఏమైనా జరిగినా, ప్రాణభయం ఉన్న తన తండ్రికి ఏదైనా జరిగినా దానికి సీఎం రేవంత్ రెడ్డి, వేం నరేందర్‌రెడ్డి, పొంగులేటి, కడియం శ్రీహరిదే పూర్తి బాధ్యత అని ఆమె తీవ్రంగా హెచ్చరించారు. కొండా సుస్మిత చేసిన ఈ వ్యాఖ్యలు అధికార కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత విభేదాలు, ముఖ్యంగా సామాజిక వర్గాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతను మరోసారి బహిర్గతం చేశాయి.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *