Bihar Polls: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో, అధికార ఎన్డీఏ (NDA) కూటమిలో సీట్ల సర్దుబాటు వ్యవహారం కలకలం రేపుతోంది. కూటమిలోని మిత్రపక్షమైన రాష్ట్రీయ లోక్ మోర్చా (RLM) అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఉపేంద్ర కుష్వాహా సీట్ల కేటాయింపుపై బహిరంగంగా తన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.
ఈసారి ఎన్డీఏ కూటమిలో పరిస్థితులు సరిగా లేవు అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎల్ఎంకు కేటాయించిన సీట్ల సంఖ్య (ఆరు స్థానాలు) పట్ల ఆయన అసంతృప్తిగా ఉన్నారు. ముఖ్యంగా, తాము కోరిన మహువా అసెంబ్లీ స్థానాన్ని మిత్రపక్షమైన లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్‌కు కేటాయించడంపై కుష్వాహా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: Mohammed Shami: ఫిట్‌నెస్‌పై షమీ ఫైర్.. సెలక్టర్లను నిలదీసిన టీమ్ ఇండియా పేసర్
ఎన్డీఏ నేతలు, కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్ సహా ఇతర బీజేపీ రాష్ట్ర నాయకులు నిన్న రాత్రి (మంగళవారం) పాట్నాలో ఉపేంద్ర కుష్వాహాతో చర్చలు జరిపినా, అవి ఫలించలేదు. చర్చల అనంతరం కూడా కుష్వాహా తన అసంతృప్తిని వెళ్లగక్కారు.
సమస్య పరిష్కారం కోసం, తన డిమాండ్లను బీజేపీ కేంద్ర నాయకత్వానికి వివరించడానికి ఆయన ఈ రోజు (బుధవారం) ఢిల్లీకి బయలుదేరారు. బీహార్‌లో ఈ కీలక దశలో కుష్వాహా అసంతృప్తి, ఆయన ఢిల్లీ పర్యటన ఎన్డీఏ కూటమికి తలనొప్పిగా మారింది. ఈ పరిణామం బీహార్ ఎన్నికల్లో ప్రధాన కూటముల బలాబలాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.