Srinivas Goud: మాజీ మంత్రి, బీఆర్ఎస్ (BRS) నాయకులు శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్‌లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన, ఆడబిడ్డ అయిన మాగంటి సునీతను అవమానించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.
మీలో మానవత్వం లేదా?:
శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, “మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్లకు కనీసం మానవత్వం ఉందా? వాళ్లు మనుషులేనా? ఒక ఆడబిడ్డ అయిన మాగంటి సునీత తన భర్తను గుర్తు చేసుకుని బాధ పడుతుంటే, దాన్ని ‘డ్రామా’ అని అంటారా?” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తుమ్మలపై ప్రశ్నల వర్షం:
గోపన్న అమర్ రహే అని జనం నినాదాలు చేస్తుంటే, తన భర్త గోపీనాథ్‌ను తలుచుకుని సునీత కన్నీరు పెట్టుకుంటే దాన్ని డ్రామా అనడం దారుణం అని గౌడ్ అన్నారు. “కమ్మ సామాజిక వర్గం ఓట్లతో గెలిచిన తుమ్మల నాగేశ్వరరావు గారు, అదే వర్గానికి చెందిన నాయకుడి భార్యను అవమానించడం సిగ్గుచేటు. ఆయన వెంటనే సునీతకు క్షమాపణ చెప్పాలి” అని డిమాండ్ చేశారు.
మంత్రుల వ్యాఖ్యలు మాగంటి సునీతకు చాలా బాధ కలిగించాయని, తెలంగాణలోని ఆడబిడ్డలందరూ ఈ మాటలను గమనించాలని ఆయన అన్నారు.
మేయర్‌పై కూడా విమర్శలు:
అదే ప్రెస్ మీట్లో మేయర్ గద్వాల విజయలక్ష్మి మంత్రుల పక్కనే కూర్చున్నారని, కానీ ఒక ఆడబిడ్డను అవమానిస్తున్నప్పుడు ఆమె మౌనంగా ఉండటం సరికాదని శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు.
“రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు పార్టీలకు అతీతంగా అందరం బాధపడ్డాం. ఇప్పుడు సునీత తన భర్త జ్ఞాపకంతో ఏడుస్తుంటే డ్రామా అనడం దారుణం, సిగ్గుచేటు. వెంటనే మంత్రులు తుమ్మల, పొన్నం ప్రభాకర్‌లు మాగంటి సునీతకు క్షమాపణ చెప్పాలి” అని శ్రీనివాస్ గౌడ్ గట్టిగా డిమాండ్ చేశారు.