Sharmila: విద్యుత్ ఉద్యోగులకు కాంగ్రెస్ అండ

Sharmila: ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ ఉద్యోగులు మంగళవారం నుంచి ప్రారంభించిన నిరవధిక సమ్మెకు కాంగ్రెస్ పార్టీ తన సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరిని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వం తక్షణమే విద్యుత్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ)తో చర్చలు ప్రారంభించాలని ఆమె డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ, “హక్కుల సాధన కోసం పోరాడుతున్న ఉద్యోగుల ఉద్యమాన్ని అణచివేయాలని ప్రభుత్వం ప్రయత్నించడం అత్యంత దారుణం. ఇది ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనం” అని అన్నారు. ఇప్పటికే 58 సార్లు చర్చలు జరిగినా సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో, 63 వేల మంది ఉద్యోగులను పరోక్షంగా సమ్మె వైపు నెడుతోందని ఆమె ఆరోపించారు.

ఉద్యోగులు చెబుతున్న 29 డిమాండ్లు పూర్తిగా న్యాయబద్ధమైనవని, వాటిని తక్షణమే అమలు చేయాలని షర్మిల ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యంగా, గత 25 ఏళ్లుగా పనిచేస్తున్న 27 వేల మంది కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని సంస్థలో విలీనం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. అలాగే ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు అపరిమిత వైద్య విధానాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.

అదే విధంగా, 7,500 మంది జూనియర్ లైన్‌మన్‌లకు పాత సర్వీసు నిబంధనలు వర్తింపజేయాలని, కారుణ్య నియామకాలను పాత విధానంలో కొనసాగించాలని షర్మిల సూచించారు. ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న 4 డీఏ/డీఆర్‌లను వెంటనే విడుదల చేయడంతో పాటు, విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

విద్యుత్ జేఏసీ చేస్తున్న ఈ ఉద్యమం ఉద్యోగుల హక్కుల కోసం జరుగుతోందని, కాంగ్రెస్ పార్టీ దీనికి పూర్తి మద్దతుగా నిలుస్తుందని షర్మిల స్పష్టం చేశారు. “ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను సీరియస్‌గా తీసుకుని, సమ్మె మరింత తీవ్రమవ్వకముందే చర్చల బాట పట్టాలి” అని ఆమె పిలుపునిచ్చారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *