Balayya issue close in Janasena: నందమూరి బాలకృష్ణ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమై, జనసేన నేతలు, మెగా అభిమానుల గుండెల్లో చిచ్చు రేపాయి. వైసీపీ హయాంలో సినీ పరిశ్రమకు అవమానం జరిగిందని, చిరంజీవి గట్టిగా అడగకపోవడం తప్పన్నట్లుగా బాలయ్య వ్యాఖ్యానించారు. ఏకంగా అసెంబ్లీలోనే టంగ్ స్లిప్ అయ్యారు. దీనిపై మెగా అభిమానులు ఆగ్రహించి, క్షమాపణ కోసం డిమాండ్ చేశారు. చిరంజీవి ప్రకటనతో వివాదం మరింత ముదిరింది. జనసైనికులు, జనసేన ఎమ్మెల్యేలు కూడా బాలయ్యపై అసంతృప్తి వ్యక్తం చేశారని ప్రచారం జరిగింది. పవన్ కళ్యాణ్ కూడా మనస్థాపానికి గురైనట్లు వార్తలు వచ్చాయి. డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా సీఎం చంద్రబాబు, వైరల్ ఫీవర్‌తో ఉన్న పవన్‌ను పరామర్శించి, ఈ అంశం చర్చించినట్లు తెలుస్తోంది. ఈ ఘటన తర్వాత మెగా అభిమానుల ఆగ్రహం కొంత తగ్గినప్పటికీ, సోషల్ మీడియాలో బాలయ్యపై మీమ్స్, రీల్స్‌తో విమర్శలు కొనసాగాయి. ఇప్పుడు పార్టీలో, కూటమిలో బాలయ్య పరిస్థితి ఏంటో అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే బాలయ్య చాకచక్యంగా ఈ వివాదం సద్దుమణిగేలా చేసుకున్నారు. జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ ఇంట శుభకార్యంలో మంత్రి లోకేష్‌తో కలిసి పాల్గొన్న బాలయ్య, జనసేన నేతలతో సరదాగా కలిసిపోయారు. అసలు వివాదం ఏమీ లేనట్లుగా కలుపుగోలుగా మాట్లాడి సమస్యను తనకు తానే పరిష్కరించుకున్నారని, ఈ విషయంలో మాత్రం బాలయ్య భేష్ అని పరిశీలకులు అంటున్నారు.
Also Read: Pawan Route Map for Vijay TVK: టీవీకే పార్టీకి పవన్ రూట్ మ్యాప్.. విజయ్‌కి మరోదారి కష్టం!
అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యల విషయంలో బాలయ్య వెనక్కు తగ్గారు అనడంలో సందేహం లేదంటున్నారు అనలిస్టులు. జనసేన ఎమ్మెల్యే నానాజీ ఇంట బాలయ్య ప్రత్యక్షమవడమే అందుకు నిదర్శనం అని చెబుతున్నారు. అయితే బాలయ్య తీరుతో నందమూరి అభిమానులు కాస్త హర్ట్ అయినట్లున్నారు. దీంతో కొత్త డిమాండ్‌ని తెరపైకి తెస్తున్నారు. సోమవారం హిందుపురంలో పర్యటించిన బాలయ్య ముందు కార్యకర్తలు, అభిమానులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. మంత్రి పదవి తీసుకోవాలని కోరారు. అభిమానుల డిమాండ్‌పై బాలయ్య నవ్వుతూనే దాట వేశారు. సమయం వచ్చినప్పుడు చూద్దామని సముదాయించారు. బాలయ్యకు తన తండ్రి ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ పట్ల ప్రేమ తప్ప… పదవులు, అధికారం పట్ల ఆశ, ఆసక్తి లేదన్నది నిజం. చంద్రబాబు, లోకేష్ నేతృత్వంలో ప్రభుత్వంలో సూపర్ పవర్స్ ఉన్నా, ఆయన తన పరిధి దాటి వ్యవహరించలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక సినిమాలు, వాటి ద్వారా దక్కే అవార్డులు, కీర్తి ప్రతిష్టల విషయంలో, అలాగే ఇండస్ట్రీలో ఆధిపత్యం వంటి అంశాల్లో చిరంజీవి డామినేషన్‌ని బాలయ్య సహించలేకపోతుంటారని కొందరు అనుకుంటారు కానీ, అందులో ఎంత మాత్రం వాస్తవం ఉందన్నది అనుమానమే. అందుకు కారణం అనేక వేదికలపై చిరు, బాలయ్యలు సందడి చేయడమే. మొత్తానికి బాలయ్య భోళాశంకరుడు… ఆయనతో ఏ సమస్య వచ్చినా ఎక్కువ రోజులు ఉండదు. అందుకు కారణం బాలయ్యలోని చిన్న పిల్లాడి మనస్థత్వం, మంచితనమే అంటున్నారు పలువురు పరిశీలకులు.