jubliee hills By elections 2025: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు వివిధ వర్గాలు సమాయత్తం అవుతున్నాయా? కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై నిరసన తెలిపేందుకు సిద్ధమవుతున్నారా? ఆయా వర్గాల తరఫున వందలాది మంది పోటీ పడనున్నారా?
సుమారు 2,000 మందికి అటూ ఇటుగా అభ్యర్థులు బరిలో నిలిచే అవకాశం ఉన్నదా? ఇదే జరిగితే ఉప ఎన్నిక పోటీకి అంతరాయం ఏర్పడుతుందా? ఈవీఎం యంత్రాలకు ఏమైనా పొరపాట్లు జరుగుతాయా? సాఫీగానే జరుగుతాయా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
jubliee hills By elections 2025: నిరుద్యోగ యువత ఓట్లతో గెలిచిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక హామీలను విస్మరించిందని నిరుద్యోగులు రగులుతున్నారు. 2 లక్షల ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భ్రుతి తదితర హామీలను కాంగ్రెస్ సర్కార్ విస్మరించిందని గత కొన్నాళ్లుగా పోరుబాటలో ఉన్నారు. దీంతో నిరుద్యోగ జేఏసీ నేతలు సమావేశమై జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పోటీ చేసేందకు నిర్ణయించారు. సుమారు 1000 మంది నిరుద్యోగులతో నామినేషన్లు వేయిస్తామని ప్రకటించారు.
jubliee hills By elections 2025: రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) అలైన్ మెంట్ మార్పుతో కాంగ్రెస్ సర్కార్ పేద రైతుల పొట్టలు కొడుతుందని రైతులు రగిలిపోతున్నారు. ఆర్ఆర్ఆర్ అలైన్‌మెంట్ మార్పుపై ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లోని రైతులు పెద్ద ఎత్తున పోరుబాట పట్టారు. అయినా వారి సమస్యలు తీరడం లేదు. దీంతో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పోటీ చేయాలని రైతులు నిర్ణయించారు. వందలాది మందితో నామినేషన్లు వేస్తామని వారు తాజాగా ప్రకటించారు.
jubliee hills By elections 2025: కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్న తమను అదే పార్టీ అధికారంలోకి వచ్చి మోసం చేసిందని మాలలు రగిలిపోతున్నారు. ఎస్సీ వర్గీకరణ అమలు చేసి మాలల అవకాశాలను కాంగ్రెస్ సర్కార్ దెబ్బతీసిందని వారంతా మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో జరుగుతున్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి కోసమే 300 మంది మాలలతో పోటీ చేయిస్తామని మాల సంఘాల జేఏసీ ప్రకటించింది.
jubliee hills By elections 2025: పెన్షనర్ల బెనిఫిట్స్ అందక ఎందరో బాధితులు ఆందోళన బాటలో ఉన్నారు. రిటైర్ అయి అవస్థల పాలవుతున్నారు. తమ సమస్యలు తీర్చాలని గత కొన్నాళ్లుగా ప్రభుత్వ పెద్దలను వేడుకుంటున్నా, తీర్చే నాథుడే కరువయ్యాడని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో వస్తున్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వందలాది మంది పెన్షనర్లు పోటీ చేయనున్నట్టు పెన్షనర్స్ అసోసియేషన్ నిన్న ప్రకటించింది. ఇంకా వివిధ వర్గాలు కూడా పోటీకి సిద్ధపడుతున్నాయి. దీంతో సుమారు 2000 మందికి పైగా అభ్యర్థులు ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. ఇదే జరిగితే ఇది మరో రికార్డ్ అవుతుందని సమాచారం.