Sankranthiki Vasthunnam Remake

Sankranthiki Vasthunnam Remake: హిందీలో సంక్రాంతికి వస్తున్నాం.. సక్సెస్ అవుతుందా?

Sankranthiki Vasthunnam Remake: తెలుగులో సంచలన విజయాన్ని సాధించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఇప్పుడు బాలీవుడ్‌ బాట పట్టబోతోంది. కుటుంబ ప్రేక్షకుల మనసులు దోచుకున్న ఈ సినిమా హిందీలో రీమేక్‌ కానుంది. ఈ వెర్షన్‌లో హీరోగా ‘అక్షయ్ కుమార్’ నటించబోతున్నారని సమాచారం. ఈ వార్త ప్రస్తుతం బాలీవుడ్‌ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం, 2025 సంక్రాంతి సందర్భంగా విడుదలై రూ.300 కోట్ల భారీ వసూళ్లు సాధించింది. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు కామెడీ ఎలిమెంట్స్‌ సమతుల్యంగా ఉండటం వల్ల ఈ సినిమా అన్ని వయస్సుల ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇప్పుడు నిర్మాత ‘దిల్ రాజు’ ఈ విజయవంతమైన ప్రాజెక్టును హిందీలో మళ్లీ తెరపైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే అక్షయ్ కుమార్‌కు సినిమా చూపించారని, ఆయన కథతో బాగా ఇంప్రెస్‌ అయ్యారని ఇండస్ట్రీ టాక్. ఈ ప్రాజెక్ట్ త్వరలోనే అధికారికంగా ప్రకటించబడే అవకాశం ఉందని తెలుస్తోంది.

Also Read: Ajay Devgan: అజయ్ దేవగన్‌పై ఫ్యాన్స్ ఫైర్!

హిందీ వెర్షన్‌కి దర్శకుడిగా ‘అనీస్ బాజ్మీ’ పేరు వినిపిస్తోంది. “భూల్ భులైయా 2”, “సింగ్ ఈజ్ కింగ్” వంటి హిట్ కామెడీ సినిమాలు తెరకెక్కించిన ఆయన ఈ రీమేక్‌కి వినోదభరితమైన టచ్‌ ఇవ్వనున్నారని బాలీవుడ్‌లో చర్చ నడుస్తోంది.

అయితే, ఇటీవలి కాలంలో బాలీవుడ్‌లో రీమేక్‌లపై ప్రేక్షకుల ఆసక్తి తగ్గిపోవడంతో ఈ సినిమా ఎంత వరకు విజయం సాధిస్తుందో చూడాలి. ‘అల వైకుంఠపురములో’ హిందీ రీమేక్‌ ‘శెహజాదా’ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. ఈ నేపథ్యంలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ రీమేక్‌కి అక్షయ్‌ మ్యాజిక్‌ ఎంతవరకు కలిసొస్తుందో కాలమే చెప్పాలి.

తెలుగులో బ్లాక్‌బస్టర్‌ సాధించిన ఈ చిత్రం, హిందీలో కూడా అదే స్థాయిలో హిట్ అవుతుందా అనే ఆసక్తి అభిమానుల్లో పెరుగుతోంది. దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించేందుకు సిద్ధమవుతున్నారు. అధికారిక ప్రకటన త్వరలో రానుందని సమాచారం.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *