Prashant Kishore: రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (పీకే) బీహార్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలను తెరలేపారు. గతంలో రాఘోపూర్ నుంచి ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ కు ఎదురుగా పోటీ చేసే అవకాశం ఉందని ప్రకటించినప్పటికీ, పీకే తన జన్ సురాజ్ పార్టీ తరఫున ఈరోజు విడుదల చేసిన రెండో జాబితాలో తన పేరును చేర్చలేదు. ఇది రాజకీయ వర్గాల్లో ఊహాగానాలకు కారణమవుతోంది.
జన్ సురాజ్ పార్టీ ఈరోజు 65 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను విడుదల చేసింది. ఇందులో 20 రిజర్వ్‌డ్ స్థానాలు (19 ఎస్సీ, 1 ఎస్టీ) మరియు 45 జనరల్ స్థానాలు ఉన్నాయి. పార్టీ అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పిస్తూ, సామాజిక న్యాయానికి ప్రాధాన్యత ఇస్తోందని ప్రకటించింది. జాబితాలో EBC నుంచి 14 మంది, OBC నుంచి 10 మంది, రిజర్వ్‌డ్ వర్గాల నుంచి 11 మంది, మైనారిటీల నుంచి 14 మంది అభ్యర్థులు ఉన్నాయి.
ప్రత్యేకంగా, మాజీ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కు చెందిన హర్నాట్ స్థానం నుంచి కమలేశ్ పాశ్వాన్ (ఎస్సీ) ను బరిలోకి దింపడం గమనార్హం.
పీకే మాట్లాడుతూ – “రెండో జాబితాతో కలిపి ఇప్పటివరకు మొత్తం 116 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాం. తొలి జాబితాలో 51 మందిని, ఇప్పుడు 65 మందిని ప్రకటించాం. మిగిలిన స్థానాలకు త్వరలోనే అభ్యర్థులను ప్రకటిస్తాం” అని తెలిపారు. ఇప్పటివరకు ప్రకటించిన అభ్యర్థుల్లో 31 మంది అత్యంత బలహీన వర్గాలకు, 21 మంది OBC, 21 మంది ముస్లింలకు చెందినవారుగా ఉన్నారని వివరించారు.
తొలి జాబితా (అక్టోబర్ 9)లో జన్ సురాజ్ పార్టీ పలువురు ప్రముఖులకు అవకాశం ఇచ్చింది. మాజీ కేంద్ర మంత్రి ఆర్.సి.పి. సింగ్ కుమార్తె లతా సింగ్, ప్రముఖ సోషలిస్ట్ నేత కర్పూరి ఠాకూర్ మనవరాలు జాగృతి ఠాకూర్, భోజ్‌పురి గాయకుడు రిథేష్ పాండే, గణిత శాస్త్రవేత్త కె.సి. సిన్హా మొదలైన వారు జాబితాలో ఉన్నారు.
బీహార్‌లోని 243 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుండగా, నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈసారి ఎన్నికలు ఎన్డీయే, ఇండియా కూటమి, మరియు జన్ సురాజ్ పార్టీ మధ్య త్రిముఖ పోరుగా మారే అవకాశం స్తోంది.