Bhatti: ఆత్మహత్య చేసుకున్న దళిత ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ కుటుంబాన్ని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పరామర్శించారు. సోమవారం ఆయన చండీగఢ్‌లోని పూరన్ కుమార్ నివాసానికి వెళ్లి, అధికారి సహచరి ఐఏఎస్ అమనీత్ గిల్‌తో పాటు కుటుంబ సభ్యులను ఓదార్చారు.
పూరన్ కుమార్ ఆత్మహత్యకు దారి తీసిన పరిణామాలపై వివరాలు తెలుసుకున్న భట్టి విక్రమార్క, ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కుటుంబానికి పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆయన, కుటుంబ సభ్యులతో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఫోన్‌లో మాట్లాడించారు. సీఎం రేవంత్ రెడ్డి పూరన్ కుమార్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసి, “ప్రభుత్వం అన్ని విధాలా మీతో ఉంటుంది” అని హామీ ఇచ్చారు.
అదేవిధంగా, భట్టి విక్రమార్క హర్యానా చీఫ్ సెక్రటరీ అనురాగ్ రస్తోగితో కూడా మాట్లాడారు. పూరన్ కుమార్ రాసిన సూసైడ్ నోట్ ఆధారంగా, అందులో ప్రస్తావించబడిన అధికారులు ఎంత పెద్దవారైనా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, కేసులు నమోదు చేయాలని ఆయన కోరారు.
పూరన్ కుమార్ మృతిపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా స్పందించిందని, దళిత అధికారుల హక్కుల పరిరక్షణ కోసం అవసరమైన చర్యలు తప్పక తీసుకుంటామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.