Chandrababu: అమరావతిలో సీఆర్డీఏ నూతన కార్యాలయ భవనం సోమవారం ఘనంగా ప్రారంభమైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ భవనం ఆవిష్కరించబడింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, “ఇది ఆరంభం మాత్రమే. అమరావతి మళ్లీ పరిపాలనా కేంద్రంగా రూపుదిద్దుకుంటోంది” అని పేర్కొన్నారు.
రాష్ట్ర విభజన తర్వాత కొత్త రాజధానికి నాంది
చంద్రబాబు మాట్లాడుతూ “రాష్ట్ర విభజన జరిగినప్పుడు రాజధాని కూడా లేని పరిస్థితి. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అభివృద్ధికి అనువైన రాజధాని ఉండాలని నిర్ణయించాం. విజయవాడ–గుంటూరు మధ్య ప్రాంతాన్ని ఎంపిక చేశాం. అప్పుడే ‘ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్’ తయారుచేశాం,” అని చెప్పారు.
అమరావతి నిర్మాణం వెనుక ఉన్న దృక్పథాన్ని వివరించిన సీఎం,
“ప్రపంచంలో ఎక్కడా లేని రాజధానిని నిర్మించాలని నిర్ణయించాం. అప్పుడు కూడా కొందరు విమర్శించారు. కానీ, హైదరాబాద్‌లో హైటెక్ సిటీ నిర్మించినప్పుడు కూడా ఇదే పరిస్థితి. నేడు ఆ నిర్ణయం వల్లే తెలంగాణకు 70 శాతం ఆదాయం వస్తోంది,”
అని గుర్తుచేశారు.
“రైతులే ఈ విజయానికి మూలం”
“రాజధాని నిర్మాణానికి భూములు అవసరమయ్యాయి. ఆ సమయంలో రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. తొలిసారిగా ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో భూములిచ్చిన చరిత్ర అమరావతి రైతులదే.రైతులు ఎన్నో కష్టాలు పడ్డారు, రోడ్డెక్కి ఉద్యమాలు చేశారు. వారి త్యాగాలను నేను ఎప్పటికీ మరవను,” అని సీఎం అన్నారు. సీఆర్డీఏ కార్యాలయ ప్రారంభానికి ప్రధాన కారణం రైతులేనని, వారి సహకారంతోనే ఈ భవనం రూపుదిద్దుకుందని చంద్రబాబు తెలిపారు.
ఇది కూడా చదవండి: Telangana: తెలంగాణ గురుకుల కాంట్రాక్ట్ సిబ్బందికి శుభవార్త!
అమరావతిని ప్రపంచస్థాయికి తీసుకెళ్లాలి
“ఇది మొదటి అడుగు మాత్రమే. రాబోయే రోజుల్లో ప్రభుత్వం, ప్రైవేటు భవనాలు కూడా ఇక్కడే వస్తాయి. అమరావతిని పర్యావరణ అనుకూల గ్రీన్ సిటీగా అభివృద్ధి చేస్తాం. రైతులు ఇప్పుడు తర్వాతి స్థాయికి ఆలోచించాలి. అమరావతి మున్సిపాలిటీగా మిగిలిపోకుండా అంతర్జాతీయ స్థాయి నగరంగా ఎదగాలి,” అని చంద్రబాబు అన్నారు.
“పరిపాలనకు అమరావతి కేంద్ర బిందువుగా ఉంటుంది”
“రాష్ట్రంలోని నదులన్నీ అనుసంధానం కావాలి. అమరావతి అభివృద్ధి కేవలం భవనాల నిర్మాణం కాదు, ఇది రాష్ట్ర భవిష్యత్తు దిశను నిర్ణయించే ప్రాజెక్టు. పరిపాలనకు అమరావతినే కేంద్ర బిందువుగా చేస్తాం,”అని సీఎం పేర్కొన్నారు.
రైతులకు పిలుపు
చంద్రబాబు చివరిగా అన్నారు “వచ్చిన అవకాశాన్ని రైతులు అందిపుచ్చుకోవాలి. అమరావతిని అభివృద్ధి చేస్తే, రైతుల జీవితాలు కూడా మారతాయి. మన కలల రాజధాని ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుంది.”