Minister prasad: అడవి పందులు పంట పొలాలను నాశనం చేస్తున్నాయని ఫిర్యాదు చేసిన గ్రామస్తులకు కేరళ వ్యవసాయ మంత్రి పి. ప్రసాద్ ఇచ్చిన సమాధానం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
కేరళలోని పాలమేల్ గ్రామ పంచాయతీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో మంత్రి ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్థులు పంటలపై అడవి పందుల దాడులు పెరిగిపోతున్నాయని, వాటి వల్ల తీవ్రమైన నష్టం జరుగుతోందని, ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
వారికి స్పందించిన మంత్రి ప్రసాద్, “అడవి పందులను చంపడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించదు” అని చెప్పారు. అయితే, పంట నష్టాన్ని సమర్థవంతంగా నివారించాలంటే వాటిని చంపడమే మార్గమని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, అడవి పందులను తినేందుకు ప్రజలకు కేంద్రం అనుమతులు ఇవ్వాలని కూడా సూచించారు.
“ఇలా చేస్తే అడవి పందుల సంఖ్య తగ్గి, రైతుల పంటలు రక్షించబడతాయి. అవి అంతరించిపోతున్న జాతి కావు, కాబట్టి వాటిని చంపడంలో తప్పులేదు” అని ఆయన వ్యాఖ్యానించారు.
మంత్రి ఈ వ్యాఖ్యలు గ్రామస్తులనే కాదు, రాజకీయ వర్గాలను కూడా ఆశ్చర్యానికి గురి చేశాయి. అడవి పందులను తినడానికి అనుమతి ఇవ్వాలన్న సూచన సామాజిక వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది.
పంటలను నాశనం చేస్తున్న అడవి పందుల సమస్య కేరళలో కొంతకాలంగా తీవ్రమైన రూపం దాల్చింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నియంత్రణ చర్యలు చేపట్టినప్పటికీ, అవి సరిపడా ఫలితాలను ఇవ్వలేదని రైతులు చెబుతున్నారు.
మంత్రి పి. ప్రసాద్ సూచనపై అధికార వర్గాలు ఎలా స్పందిస్తాయో, కేంద్రం ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.