Tirupati: తిరుపతి నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. తిరుపతిలోని గరుడవారధి ఫ్లైఓవర్‌పై నుంచి కిందపడి ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
వివరాలు ఇలా…
వివరాల్లోకి వెళితే, బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు అతివేగంగా ఫ్లైఓవర్‌పై దూసుకెళ్లారు. వేగంగా వెళ్లడం వల్లే బైక్ అదుపుతప్పి ఫ్లైఓవర్ గోడను ఢీకొట్టి, అక్కడి నుంచి అమాంతం కిందపడిపోయిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు… ఇద్దరు యువకుల మృతదేహాలను పోస్ట్‌మార్టమ్ నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వీరి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
అతివేగమే కారణం: పోలీసులు
ఈ ప్రమాదానికి అతివేగమే ప్రధాన కారణం అని ప్రాథమిక విచారణలో పోలీసులు నిర్ధారించారు. బైక్ వేగంగా ఉండడం వల్లే యువకులు వాహనంపై నియంత్రణ కోల్పోయారని తెలిపారు. వాహనదారులు ఫ్లైఓవర్లపైనా, రోడ్లపైనా జాగ్రత్తగా, నిదానంగా ప్రయాణించాలని పోలీసులు హెచ్చరించారు. ఈ ఘటనపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.