Damacherla Political Changes: ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో గెలుపొందిన దామచర్ల జనార్థన్ తన రాజకీయ శైలిని మార్చుకున్నారట. గత ఏడాది కాలంగా ఆయన వ్యవహరించిన తీరు, ఇటీవల కాలంలో ఆయనలో కనిపిస్తున్న మార్పులు ఒంగోలు నియోజకవర్గంతో పాటు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయట. ఇంతకుముందు వరకూ, ఇతర పార్టీల నుంచి టీడీపీలో కానీ, కూటమి పార్టీలలో కానీ చేరిన నాయకులతో దామచర్ల దూరం పాటించారు. దీనికి వ్యక్తిగత కారణాలతో పాటు రాజకీయ పరిస్థితులు కూడా కారణంగా నిలిచాయి. అయితే, ఈ వైఖరి వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని, గ్రూపు రాజకీయాలు మరింత పెరిగే అవకాశం ఉందని సీఎం చంద్రబాబు నాయుడు దామచర్లకు సూచించారట.
Also Read: CM Ramesh: సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు.. ‘జగన్ అసెంబ్లీకి వస్తే సెల్యూట్ చేస్తా!’
వాస్తవానికి రాజకీయాల్లో ఒక్కోసారి వ్యక్తిగత వైరుధ్యాలను పక్కన పెట్టి ముందుకు వెళ్లాల్సి వస్తూ ఉంటుంది. కానీ, 2019 ఎన్నికల్లో తన సొంత పార్టీ నాయకులే తనకు వ్యతిరేకంగా నిలిచి తన ఓటమికి కారణమయ్యారన్న బాధ దామచర్లను కొంతకాలం వెంటాడింది. ఇప్పుడు అదే నాయకులు తిరిగి టీడీపీలోకి వచ్చి ప్రముఖ పాత్ర పోషిస్తామన్నప్పుడు ఎవరికైనా ఇబ్బందిగానే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే దామచర్ల అలాంటి వారికి దూరం జరిగారు. అయితే, ఇటీవల జరిగిన ఒక వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు దామచర్లకు సున్నితంగా సలహా ఇచ్చారంటున్నారు. “మీకు మంచి పేరు ఉంది. అందరినీ కలుపుకుని పోండి. ఏమైనా సమస్య వస్తే నేను చూసుకుంటాను. మీరు మీ పనిని ఆపొద్దు” అంటూ భరోసా ఇచ్చారట సీఎం చంద్రబాబు. ఈ సూచనతో దామచర్ల జనార్థన్, ఆయన సోదరుడు సత్యలు రూటు మార్చుకుని కొత్త దారిలో అడుగుపెట్టారంటున్నారు. ఇప్పుడు అందరినీ కలుపుకుని ముందుకు సాగుతున్నారట దామచర్ల.
ఇటీవల జరిగిన ఆటో డ్రైవర్ల సేవా కార్యక్రమంలో దామచర్ల ఉత్సాహంగా పాల్గొన్నారు. అంతేకాదు, వైసీపీ నుంచి టీడీపీలో చేరి ఎంపీగా గెలిచిన మాగుంట శ్రీనివాసులు రెడ్డితో సహా ఇతర నాయకులతో స్నేహపూరితంగా వ్యవహరించారు. ఆయన స్వయంగా ఆటో నడుపుతూ, ఇతర నాయకులను ఎక్కించుకుని, వారితో కలిసి టీ పార్టీలకు కూడా హాజరయ్యారు. దీంతో, ఒంగోలు నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలకు దామచర్ల దాదాపు చెక్ పెట్టినట్లు చెబుతున్నారు. ఈ దిశగా కొనసాగితే, అందరూ ఒక్కటిగా ఉంటే, వైసీపీకి ఇక చోటు ఉండదన్న వాదన బలంగా వినిపిస్తోంది.