BRS: చలో బస్ భవన్ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ సర్కార్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి, ప్రయాణికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయా చోట్ల కేటీఆర్, హరీశ్ మాట్లాడుతూ పలు అంశాలను లేవనెత్తారు. రేవంత్‌రెడ్డీ ఇవిగో ప్రయాణికుల సమస్యలు అంటూ ఆర్టీసీ ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరువు పెట్టారు.
BRS: కాంగ్రెస్ ప్రభుత్వం విచక్షణారహితంగా సిటీ బస్సు చార్జీలను పెంచడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ చలో బస్‌భవన్ కార్యక్రమానికి పిలుపునిచ్చినట్టు కేటీఆర్, హరీశ్‌రావు తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి, మగవారి చార్జీలను రెట్టింపు చేశారని ధ్వజమెత్తారు. పిల్లలకు బస్ పాస్‌ల ఫీజులనూ పెంచితే కుటుంబంపై భారం పడుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ఉచిత ప్రయాణం పేరిట మహిళలు బస్సులు ఎక్కితే సీట్లే దొరకని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.
BRS: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏటా ఆర్టీసీ సంస్థకు రూ.1,500 కోట్లు గ్రాంట్ ఇచ్చేవాళ్లమని కేటీఆర్, హరీశ్ రావు చెప్పారు. ఇప్పుడు ఆర్టీసీని ప్రైవేటుపరం చేస్తున్నారని విమర్శించారు. ప్రజావసరాల రీత్యా కేసీఆర్ నాడు ముఖ్యమంత్రిగా ఆర్టీసీలో ప్రవేశపెట్టిన కార్గో సేవలతో సంస్థకు ఏటా రూ.100 కోట్ల ఆదాయం తెస్తే, ఇప్పుడు అదే కార్గోను ప్రైవేటుపరం చేశారని మండిపడ్డారు.
BRS: పెంచిన చార్జీలతో నగర ప్రజలు తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారని, మెహిదీపట్నం నుంచి బస్‌బవన్ వరకు గతంలో రూ.30 ఉంటే, ఇప్పుడు రూ.40 చేయడంతో రోజూ ప్రయాణికులపై రాను పోను కలిపి రూ.20 అదనపు భారం పడిందని కేటీఆర్, హరీశ్ రావు తెలిపారు. దీంతో సామాన్య, మధ్యతరగతి వర్గాలు ఈ భారంతో సతమతం అవుతున్నారని తెలిపారు. పెంచిన అదనపు చార్జీలను వెంటనే తగ్గించాలని, ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.
BRS: హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ బస్సులను పెట్టి ప్రైవేటు పరం చేస్తున్నారని, ఇక్కడ పనిచేసే ఉద్యోగులను జిల్లాలకు బదిలీ చేస్తారని కేటీఆర్, హరీశ్ ఆరోపించారు. దీంతో ఆయా కుటుంబాలు అనేక అవస్థలు పడతారని, దానికి బాధ్యులెవరని ప్రశ్నించారు. ఇదే సమయంలో ప్రయాణికులతో వారిద్దరూ మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. కాంగ్రెస్ హామీలు అమలవుతున్నాయా? అంటూ ప్రశ్నించారు. అంతటా తమకు సీట్లు దొరకడం లేదని, ఎందుకు ఫ్రీ బస్సులు పెట్టారోనని పలువురు ప్రయాణికులు ఆవేదన వ్యక్తంచేయడం గమనార్హం.
కాంగ్రెస్ సర్కార్ సర్కార్ నడుపుతలేదు.. సర్కస్ నడుపుతుంది అని కేటీఆర్, హరీశ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉదయం హౌస్ అరెస్టు అంటూ 50 మంది పోలీసులు తమ ఇంటికి వచ్చారని, తమ పార్టీ ప్రోగ్రాంకు వెళ్లాలని చెప్పగా, అనుమతించారు. నగరవ్యాప్తంగా బీఆర్ఎస్ కార్పొరేటర్లను, ఇతర నేతలను అక్రమంగా అరెస్టు చేసి, పోలీస్ స్టేషన్లకు తరలించారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు.