Manu singhvi: హైకోర్టులో బీసీ రిజర్వేషన్లపై విచారణలో పిటిషనర్ల తరఫు లాయర్ల వాదనలు పూర్తి అయ్యాయి. అనంతరం ప్రభుత్వం తరఫున సీనియర్ లాయర్ అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు.
అభిషేక్ మను సింఘ్వీ ఈ సందర్భంగా మాట్లాడుతూ, బీసీ రిజర్వేషన్ల పెంపుపై అన్ని రాజకీయ పార్టీలు అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించాయని గుర్తుచేశారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం రిజర్వేషన్లు పెంచుకునే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఇలాంటి ప్రజా ప్రయోజన అంశంపై జారీ చేసిన జీవోపై స్టే ఇవ్వమని కోరడం సరైంది కాదని పేర్కొన్నారు.
అలాగే ఏక సభ్య కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచినట్లు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 97 శాతం ఇంటింటి సర్వే పూర్తయిందని, దాని ఆధారంగానే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
అభిషేక్ మను సింఘ్వీ మరింతగా మాట్లాడుతూ, బీసీ రిజర్వేషన్ బిల్లును గవర్నర్‌కు పంపినప్పటికీ, ఇప్పటివరకు ఆయన ఆమోదించలేదని, తిరస్కరించలేదని స్పష్టం చేశారు. ఈ వాదనల అనంతరం కేసు తదుపరి విచారణకు వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.