Myanmar: మయన్మార్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. ఒక బౌద్ధ ఉత్సవం జరుగుతుండగా దానిపై పారాగ్లైడర్ ద్వారా బాంబు దాడి జరిగింది. ఈ దారుణ ఘటనలో కనీసం 24 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 47 మంది గాయపడ్డారు.
ఏమి జరిగింది?
స్థానిక అధికారి ఒకరు తెలిపిన వివరాల ప్రకారం, జుంటా వ్యతిరేక పీపుల్స్ డిఫెన్స్ ఫోర్స్ (PDF) ఈ దాడికి పాల్పడింది. సోమవారం సాయంత్రం సుమారు 100 మంది ప్రజలు చాంగ్ యు టౌన్‌షిప్‌లో గుమిగూడి ఉన్నారు. ఈ సమయంలో పారాగ్లైడర్ ద్వారా రెండు బాంబులు వారిపైకి విసిరారు.
మృతుల్లో సామాన్య పౌరులే అధికంగా ఉన్నారని తెలుస్తోంది. గాయపడిన 47 మందికి చికిత్స అందిస్తున్నారు.
‘లైట్ల పండుగ’పై దాడి
దాడి జరిగిన రోజున ప్రజలు థాడింగ్యుట్ పండుగ (Thadingyut festival) కోసం సమావేశమయ్యారు. ఈ పండుగ బౌద్ధ మూలాలతో కూడిన జాతీయ సెలవుదినం. దీనిని ‘లైట్ల పండుగ’ అని కూడా పిలుస్తారు. ఈ రోజు మయన్మార్ వ్యాప్తంగా ప్రజలు కొవ్వొత్తులు, లాంతర్లు వెలిగించి సామూహిక సమావేశాలు నిర్వహిస్తారు.
ఈ ప్రత్యేక సమావేశాన్ని సైనిక నిర్బంధానికి, రాబోయే ఎన్నికలకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనగానూ నిర్వహించారు. అలాగే, ఆంగ్ సాన్ సూకీతో సహా రాజకీయ ఖైదీల విడుదల కోరుతూ కొవ్వొత్తుల ప్రదర్శన జరిగింది. ఇలా ప్రశాంతంగా జరుగుతున్న కార్యక్రమంపై బాంబు దాడి జరగడం మయన్మార్‌లోని ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులకు నిదర్శనం.
అంతర్యుద్ధంలో మయన్మార్
2021లో సైన్యం తిరుగుబాటు చేసి అధికారాన్ని చేపట్టినప్పటి నుంచి మయన్మార్ దేశం అంతర్యుద్ధంలో చిక్కుకుంది. అప్పటి నుండి ఇప్పటివరకు 5,000 మందికి పైగా పౌరులు మరణించారని ఐక్యరాజ్యసమితి (UN) అంచనా వేసింది.
అంతర్జాతీయ ఆంక్షల కారణంగా విమానాలు, జెట్ ఇంధనం కొరత ఏర్పడడంతో, సైన్యం కూడా తరచుగా పారామోటర్లను ఉపయోగించి ఆకాశం నుండి బాంబు దాడులు చేస్తోంది. ఇప్పుడు సైన్యానికి వ్యతిరేకంగా పోరాడుతున్న పీపుల్స్ డిఫెన్స్ ఫోర్స్ కూడా పారాగ్లైడర్‌లను ఉపయోగించడం పరిస్థితి ఎంత ప్రమాదకరంగా మారిందో తెలియజేస్తుంది.
గతంలో కూడా, ఈ సంవత్సరం ప్రారంభంలో చాంగ్ యు టౌన్‌షిప్‌లో ఇలాంటి దాడులు జరిగాయని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ నివేదించింది. సైనిక తిరుగుబాటు తర్వాత మొదటిసారిగా దేశంలో సాధారణ ఎన్నికలు డిసెంబర్‌లో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ హింస మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.