Sabarimala Ayyappa: శబరిమల అయ్యప్ప ఆలయంలో ద్వారపాలకుల విగ్రహాలకు బంగారు పూత పూయడంలో జరిగిన అవకతవకల కేసులో సీనియర్ అధికారిని ట్రావెన్ కోర్ దేవస్తానం బోర్డు తొలగించింది. డిప్యూటీ దేవస్వోం కమిషనర్ బాధ్యతల నుంచి బి.మురారీ బాబును తప్పించిన బోర్డు.. కేసు దర్యాప్తు కొనసాగుతోందని తెలిపింది. 2019లో ఆలయ పరిపాలనా అధికారిగా ఉన్నప్పుడు ద్వారపాలక విగ్రహాలను రాగి పూత పూసినవిగా పేర్కొంటూ శబరిమల కార్యనిర్వాహక అధికారికి తప్పుడు నివేదికను అందించారని వివరించింది. తనపై వచ్చినవి తప్పుడు ఆరోపణలని, ఆలయ తంత్రీల అభిప్రాయం తర్వాతే నివేదిక తయారుచేసినట్లు మురారీ చెబుతున్నారు. అవి నిజంగా రాగి పలకలేనని, అందుకే వాటికి పూతపూయాలని ఆదేశించారని, తన నివేదిక సరైందేనని మురారీ వివరించారు.
ఇది కూడా చదవండి: BC Reservations: హైకోర్టులో బీసీ రిజర్వేషన్ల తీర్పుపై ఉత్కంఠ
కాగా ఈ కేసు దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు చేయాలని కేరళ హైకోర్టు అదేశించింది. బంగారు పూత కోసం ద్వారపాలకుల విగ్రహాల తాపడాలను చివరిసారిగా 2019లో తొలగించారు. తర్వాత వాటి బరువు నాలుగున్నర కిలోలు తగ్గడం ఈ వివాదానికి కారణమైంది. దీనిపై కేరళ కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పథనంతిట్టలో ఆలయ బోర్డు ఆఫీసును యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ధ్వంసం చేశారు. కాగా ఆలయ గర్భగుడి (శ్రీకోవిల్) ప్రవేశ ద్వారం వద్ద ఉన్న ద్వారపాలకుల విగ్రహాలకు 1999లో పారిశ్రామికవేత్త విజయ్ మాల్యా విరాళంగా ఇచ్చిన బంగారంతో పూత వేయించారు. ద్వారపాలకుల విగ్రహాలకు సుమారు 1.564 కిలోల బంగారం ఉపయోగించినట్లు పత్రాలు చెబుతున్నాయి. 2019లో పునరుద్ధరణ పనుల తర్వాత తిరిగి అప్పగించినప్పుడు, ఆ పలకల మొత్తం బరువులో సుమారు 4.54 కిలోల వరకు వ్యత్యాసం (తగ్గుదల) కనిపించింది. పాత బంగారు పూతను తొలగించడంలో లేదా కొత్త పూతలో బంగారం మాయమైందనే ఆరోపణలు వచ్చాయి.