హైడ్రా విషయంలో సీఎం రేవంత్ సోదరుడికి ఓ న్యాయం, సామాన్యులకు ఓ న్యాయమా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో శేరిలింగంపల్లి నాయకులతో సమావేశమయ్యారు. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే అందరికీ ఒకటే న్యాయం చేయాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల బతుకు జూబ్లీ బస్టాండే అవుతుందని కేటీఆర్ కామెంట్స్ చేశారు. త్వరలో 10 చోట్ల ఉప ఎన్నికలు తప్పవన్నారు. డ్రామాలతో ఎక్కువ కాలం రాజకీయం నడవదన్నారు. మేం నిర్మాణాలు చేస్తే, కాంగ్రెస్ వాటిని కూల్చుతోంది. రైతు భరోసా కాదు.. సీఎం కుర్చీకే భరోసా లేదని ఆయన సెటైర్లు వేశారు. హైడ్రా పేరుతో పేదల బతుకులను ప్రభుత్వం రోడ్డుపై వేస్తుందని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే నిర్మాణ అనుమతులు ఇచ్చినవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో అక్రమంగా అనుమతులు ఇచ్చింది కాంగ్రెస్సే అని ఆరోపించారు. పేదల ఇళ్లు కూలిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. బతుకమ్మ పండుగలకు ఆడబిడ్డలకు తులం బంగారం వెంటనే ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ 9 నెలల పాలనలో ఇప్పటివరకు రూ.4000 ఏ అవ్వకు రాలేదన్నారు.
