Bus Fares Hike

Bus Fares Hike: తెలంగాణ బస్సు చార్జీలు పెంపు: నేటి నుంచి అదనపు భారం

Bus Fares Hike: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో ప్రయాణించే నగరవాసులపై అదనపు భారం మోపింది. నగరంలో నడిచే అన్ని రకాల సిటీ బస్సుల్లో అదనపు ఛార్జీలు నేటి (అక్టోబర్ 6) నుంచి పెరగనున్నాయి. ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయం ప్రయాణికులకు పెద్ద షాక్‌గా మారింది.

పెంపు వివరాలు ఇవే:
పెరిగిన బస్సు ఛార్జీలు సోమవారం (అక్టోబర్ 6) నుంచి అమల్లోకి వస్తాయని తెలంగాణ ఆర్టీసీ ప్రకటించింది. ఛార్జీల పెంపు వివరాలు బస్సు రకం, స్టేజీని బట్టి ఇలా ఉన్నాయి:

1. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఎలక్ట్రిక్ బస్సులు (ఆర్డినరీ/ఎక్స్‌ప్రెస్):

మొదటి మూడు స్టేజీల వరకు: రూ. 5 అదనంగా పెరుగుతుంది.

ఉదాహరణకు: ప్రస్తుతం కనీస చార్జీ రూ. 10 ఉంటే, ఇప్పుడు అది రూ. 15 అవుతుంది.

నాలుగో స్టేజీ నుంచి చివరి వరకు: రూ. 10 అదనంగా పెరుగుతుంది.

2. మెట్రో డిలక్స్, ఎలక్ట్రిక్-మెట్రో ఏసీ బస్సులు:

మొదటి స్టేజీకి: రూ. 5 అదనంగా పెరుగుతుంది.

రెండో స్టేజీ నుంచి చివరి వరకు: రూ. 10 అదనంగా పెరుగుతుంది.

ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయంతో టికెట్ ధరలు కనీస చార్జీపై దాదాపు 50 శాతం వరకు పెరిగాయి.

Also Read: Congress: జూబ్లీహిల్స్‌ బరిలో నిలిచేదెవరు ? ఆ నలుగురి పేర్లు తెరపైకి

ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో భారాన్ని మోయలేకే సిటీ బస్సు ఛార్జీని పెంచినట్లు ఆర్టీసీ స్పష్టం చేసింది. ముఖ్యంగా, ‘మహాలక్ష్మి’ ఉచిత ప్రయాణ పథకం అమలులోకి వచ్చిన తర్వాత సిటీ బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. గతంలో రోజుకు 11 లక్షల మంది ప్రయాణించగా, ఇప్పుడు ఆ సంఖ్య 26 లక్షలకు చేరింది.

ఈ నేపథ్యంలో, కొత్త డిపోలు, ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు, ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు వంటి వాటికి సుమారు రూ. 392 కోట్ల మేర వ్యయం అవుతుందని ఆర్టీసీ అంచనా వేసింది. ఇప్పటికే విద్యార్థుల బస్‌పాస్‌లు, టీ-24 టికెట్ ధరలను పెంచిన ఆర్టీసీ, ఇప్పుడు సాధారణ ప్రయాణికులపై కూడా ఈ భారాన్ని మోపింది. ప్రస్తుతం నగరంలో 2,800 బస్సులు తిరుగుతున్నాయి, వీటిలో 265 ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయి. 2027 నాటికి 2,800 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టే ప్రణాళికలో భాగంగానే ఈ ఆర్థిక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *