Rain Alert: తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గత రెండు రోజులుగా భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, క్యూములోనింబస్ మేఘాల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. హైదరాబాద్ వాతావరణ శాఖ (IMD) ఈ రోజు (ఆదివారం), రేపు (సోమవారం) రాష్ట్రంలోని అనేక ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
రాష్ట్ర రాజధాని గ్రేటర్ హైదరాబాద్‌లో వరుసగా రెండో రోజు భారీ వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఖైరతాబాద్, పంజాగుట్ట, లక్డీకపూల్, అబిడ్స్ వంటి ముఖ్య ప్రాంతాలతో పాటు పటాన్‌చెరు, గచ్చిబౌలి, కూకట్‌పల్లి వంటి శివారు ప్రాంతాల్లోనూ వాన ప్రభావం అధికంగా ఉంది.
లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
నగరంలో పలు ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలవడంతో తీవ్ర ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పరిస్థితిని పర్యవేక్షించడానికి జీహెచ్ఎంసీ అధికారులు, ఎస్డీఆర్‌ఎఫ్ (SDRF) బృందాలు అప్రమత్తమై, సహాయక చర్యలు చేపట్టారు.
జిల్లాల్లో పరిస్థితి:
రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. వికారాబాద్ జిల్లాలో తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షాలకు కోటిపల్లి ప్రాజెక్టు అలుగు పారుతోంది. గొట్టిముక్కల వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో గొట్టిముక్కల-నాగారం గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వికారాబాద్‌లో భారీ వర్షాల కారణంగా మూసీ నదికి వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉందని, దీని ప్రభావం హైదరాబాద్‌లోని లోతట్టు ప్రాంతాలపై పడొచ్చని అధికారులు హెచ్చరించారు. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో అత్యధికంగా 11 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఖమ్మం, సంగారెడ్డి, జనగామ, మహబూబాబాద్ జిల్లాల్లోనూ అధిక వర్షపాతం నమోదైంది.
Also Read: Gold Rate: ఆల్-టైం హైకి దగ్గరగా బంగారం: నేడు 10 గ్రాముల ధర ఎంత?
ఎల్లో అలర్ట్ జారీ అయిన జిల్లాలు:
నేడు, రేపు (సోమవారం) తెలంగాణలోని దాదాపు 27 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయబడింది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, వికారాబాద్ వంటి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురు గాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
అధికారుల సూచన:
అధిక వర్షపాతం, వరద ప్రవాహం ఉన్న ప్రాంతాల ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు సూచించారు. రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఈశాన్య, వాయవ్య అరేబియా సముద్రంలో కొనసాగుతున్న ‘శక్తి’ తీవ్ర తుఫాను రేపు ఒమన్‌లో తీరం దాటే అవకాశం ఉన్నప్పటికీ, దీని ప్రభావంతో తెలంగాణ, కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.