Gang Rape: చింతపల్లి మండలంలోని ఓ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల తొమ్మిదో తరగతి విద్యార్థినిపై జరిగిన గ్యాంగ్ రేప్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దారుణంపై సెప్టెంబర్ 13న ఫిర్యాదు చేసినప్పటికీ, చింతపల్లి పోలీసులు స్పందించకపోవడంపై బాధిత బాలిక, గిరిజన నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. న్యాయం కోసం వారు శుక్రవారం పాడేరు ఐటీడీఏలో కలెక్టర్ దినేష్ కుమార్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.
జరిగింది ఇదీ..
పోలీసులు, కలెక్టర్‌కు సమర్పించిన ఫిర్యాదు వివరాల ప్రకారం..
- సెప్టెంబర్ 5న, లంబసింగికి చెందిన ఒక మహిళ మాయమాటలు చెప్పి బాలికను తన వెంట తీసుకెళ్లింది.
- ఆ తర్వాత, తోటమామిడికి చెందిన యువకుడి బైక్‌పై బాలికను నర్సీపట్నంకు తీసుకెళ్లారు.
- నర్సీపట్నం నుంచి జి.మాడుగుల మండలం వంజరికి చెందిన మరో యువకుడి కారులో వీరు ముగ్గురూ కలిసి విశాఖపట్నం చేరుకున్నారు.
- విశాఖపట్నంలో ఓ ఇంట్లో బాలికను బంధించి, తోటమామిడి, వంజరి యువకులు ఆమెపై ఏకంగా మూడు రోజుల పాటు అత్యాచారం చేశారు.
- నాలుగో రోజు, బాలికను నర్సీపట్నం తీసుకొచ్చి, ఓ లాడ్జిలో ఉంచారు. అనంతరం లాడ్జి నిర్వాహకుడితో బాలికకు కేవలం రూ. 100 ఇప్పించి, నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.
ఇది కూడా చదవండి: Crime News: బిడ్డకు జన్మనిచ్చిన 15 ఏళ్ల బాలిక..
పోలీసుల తీరుపై ఆగ్రహం
బాధితురాలు సెప్టెంబర్ 12న నర్సీపట్నం నుంచే కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి, తనపై జరిగిన దారుణాన్ని వివరించింది. విషయాన్ని తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు సెప్టెంబర్ 13న చింతపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ దారుణానికి పాల్పడిన ముగ్గురు వ్యక్తుల వివరాలను కూడా పోలీసులకు అందించారు.
అయినా, చింతపల్లి పోలీసులు రేపు, ఎల్లుండి అంటూ ఫిర్యాదుపై కాలయాపన చేయడంతో గిరిజన నాయకులు, బాధితులు శుక్రవారం కలెక్టర్‌ను ఆశ్రయించాల్సి వచ్చింది. కాంగ్రెస్ నాయకులు బాలకృష్ణ, సీపీఐ నాయకులు చంటిబాబు తదితరులు బాలికతో కలిసి కలెక్టర్‌కు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ వ్యవహారంపై తక్షణమే సమగ్ర విచారణ జరిపి, నిందితులను కఠినంగా శిక్షించాలని, నిర్లక్ష్యం వహించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు కలెక్టర్‌ను కోరారు. ఈ దారుణ ఘటనపై జిల్లా ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు చూడాలి.