Karur Stampede: కరూర్ తొక్కిసలాట ఘటనపై సిట్ విచారణకు మద్రాస్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. IG అస్రాగార్గ్ నేతృత్వంలో… సిట్ దర్యాప్తునకు ఆదేశించింది. తొక్కిసలాట ఘటనపై దాఖలైన పలు పిటిషన్లను విచారించిన హైకోర్టు తమిళనాడులో బహిరంగ సభలపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రోడ్లు, జాతీయ రహదారులపై బహిరంగ సమావేశాలు సహా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకుండా ఉత్తర్వులు ఇచ్చింది. ప్రామాణిక నిర్వహణ విధాన నిబంధనలు-SOP రూపొందించే వరకు నిషేధం అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. కేటాయించిన ప్రదేశాలు మినహా జాతీయ రహదారులపై భేటీలకు అనుమతించబోమని తేల్చిచెప్పింది.
మరోవైపు తొక్కిసలాట ఘటనపై సీబీఐ దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్లను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో.. పోలీసుల దర్యాప్తు ఇంకా ప్రారంభ దశలోనే ఉందని గుర్తుచేసింది. ఇప్పుడే CBI దర్యాప్తు కోరడం సరికాదని పేర్కొంది. కోర్టులను రాజకీయ వేదికలుగా మార్చవద్దని హితవు పలికింది. విచారణ సందర్భంగా రాజకీయ పార్టీలకు మద్రాస్ హైకోర్టు కీలక సూచనలు చేసింది. భవిష్యత్తులో నిర్వహించే బహిరంగ సభలు, సమావేశాల్లో తాగునీరు, పారిశుద్ధ్య సౌకర్యాలు, అంబులెన్స్ సేవలు, నిష్క్రమణ మార్గాలు వంటి ప్రాథమిక సౌకర్యాలు కల్పించాలని ఆదేశించింది. ప్రజల ప్రాణాల రక్షణకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని మద్రాస్ హైకోర్టు వెల్లడించింది.
ఇది కూడా చదవండి: NSG Commando: గంజాయి స్మగ్లింగ్ రాకెట్ నిర్వహిస్తున్న ఎన్ఎస్‌జీ మాజీ కమాండో
విజయ్ రాజకీయ పార్టీ (TVK) నిర్వహించిన బహిరంగ సభకు అధిక సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఈ క్రమంలో జరిగిన తోపులాట, తొక్కిసలాట కారణంగా ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ తొక్కిసలాటలో సుమారు 41 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు, పదుల సంఖ్యలో గాయపడ్డారు. మరణించినవారిలో కొందరు చిన్నారులు కూడా ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు TVK పార్టీ ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్ సహా మరికొందరిపై కేసు నమోదు చేసి, కొందరిని అరెస్టు చేశారు. ఈ ఘటనపై నటుడు విజయ్ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, ఇది తన జీవితంలో ఎప్పుడూ ఎదుర్కోని బాధాకర పరిస్థితి అని తెలిపారు. ఈ దుర్ఘటన వెనుక నిజానిజాలు త్వరలో బయటకు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.