Akshay Kumar: బాలీవుడ్ సీనియర్ నటుడు అక్షయ్ కుమార్ ఇటీవల ముంబైలో జరిగిన సైబర్ అవగాహన సదస్సులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, సీనియర్ పోలీసు అధికారులు కూడా హాజరయ్యారు. సైబర్ నేరాల ప్రమాదాలపై మాట్లాడిన అక్షయ్ కుమార్, తన కుటుంబానికి సంబంధించిన ఒక సంఘటనను అందరితో పంచుకున్నారు.
గేమ్ ఆడుతుండగా న్యూడ్ ఫోటోలు అడిగిన క్రిమినల్
కొన్ని నెలల క్రితం తన టీనేజ్ కూతురు నితారా ఆన్‌లైన్ గేమ్ ఆడుతుండగా ఓ అపరిచితుడు స్నేహపూర్వకంగా చాట్ మొదలుపెట్టి, తర్వాత అకస్మాత్తుగా నగ్న ఫోటోలు పంపాలని డిమాండ్ చేశాడని అక్షయ్ తెలిపారు. కానీ ఆ సమయంలో నితారా అప్రమత్తంగా స్పందించి తన ఫోన్‌ను ఆఫ్ చేసి, వెంటనే తల్లి దగ్గరికి వెళ్లి విషయం చెప్పిందన్నారు.
అక్షయ్ కుమార్ మాట్లాడుతూ – “నా కూతురు సమయస్పూర్తితో వ్యవహరించకపోతే ఆ సైబర్ క్రిమినల్ బారిన పడే ప్రమాదం ఉండేది. ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి. పిల్లలందరూ అలర్ట్‌గా ఉండాలి. తల్లిదండ్రులు కూడా వారిని సైబర్ మోసాల నుంచి కాపాడేందుకు అవగాహన కల్పించాలి” అన్నారు.
స్కూళ్లలో సైబర్ పాఠాలు తప్పనిసరి చేయాలని డిమాండ్
అక్షయ్ కుమార్ ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ, “చరిత్ర, గణితం ఎలా బోధిస్తామో.. అలాగే సైబర్ సేఫ్టీని కూడా పాఠశాలల్లో తప్పనిసరి చేయాలి. ఏడో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులకు ప్రతి వారం ఒక సైబర్ పీరియడ్ పెట్టాలి. వీధి నేరాల కంటే సైబర్ నేరాలు మరింత పెద్దవిగా మారుతున్నాయి” అని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Pvn Madhav: పెట్రోల్ ధరలు తగ్గకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలే కారణం
మహిళలు, టీనేజర్లకు పెద్ద ముప్పు
ప్రస్తుతం దేశవ్యాప్తంగా అనేక మహిళలు, టీనేజర్లు ఇలాంటి సైబర్ మోసాల బారిన పడుతున్నారని, చాలా సందర్భాల్లో బెదిరింపులు, మానసిక ఒత్తిడికి గురై బాధితులు తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని అక్షయ్ ఆందోళన వ్యక్తం చేశారు.
అక్షయ్ కుమార్ కుటుంబం, కెరీర్
2001లో ట్వింకిల్ ఖన్నాను వివాహం చేసుకున్న అక్షయ్ కుమార్‌కు ఇద్దరు సంతానం – కుమారుడు ఆరవ్, కూతురు నితారా ఉన్నారు. ప్రొఫెషనల్ విషయానికి వస్తే, ఇటీవలే హౌస్‌ఫుల్ 5 సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఆయన, తెలుగులో మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న కన్నప్ప చిత్రంలో శివుడి పాత్రలో కనిపించనున్నారు. అలాగే ఈ ఏడాది క్రిస్మస్‌కు వెల్కమ్ టు ది జంగిల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.