World Cup 2025: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో బంగ్లాదేశ్ మహిళల జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై 7 వికెట్ల తేడాతో తిరుగులేని విజయం సాధించి సంచలనం సృష్టించింది. బౌలింగ్, బ్యాటింగ్‌లలో సమష్టిగా రాణించిన బంగ్లా జట్టు తమ ఖాతాలో విజయాన్ని నమోదు చేసుకుంది.
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ మహిళల జట్టుకు బంగ్లాదేశ్ బౌలర్లు చుక్కలు చూపించారు. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో పాక్ బ్యాటర్లను కట్టడి చేశారు. కేవలం 38.3 ఓవర్లలో 129 పరుగులకే పాకిస్థాన్‌ను ఆలౌట్ చేశారు. పాక్ జట్టులో రమీన్ షమీమ్ (23), ఫాతిమా సనా (22) మాత్రమే కాస్త పర్వాలేదనిపించారు. మిగతా బ్యాటర్లలో ఎవరూ పెద్ద స్కోరు చేయలేకపోయారు.
బౌలర్ల ప్రదర్శన: బంగ్లాదేశ్ తరపున షోర్నా అక్తర్ మూడు వికెట్లు తీసి పాక్ నడ్డి విరిచింది. మరూఫా అక్తర్, నహిదా అక్తర్ చెరో రెండు వికెట్లు పడగొట్టి విజయంలో కీలక పాత్ర పోషించారు.
Also Read: Women’s ODI WC: శ్రీలంకను చిత్తు చేసిన భారత్.. సత్తాచాటిన దీప్తి శర్మ
కేవలం 130 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లాదేశ్‌కు ఆదిలో రెండు వికెట్లు కోల్పోయి కొంచెం కంగారు పడ్డా, ఆ తర్వాత పుంజుకుంది. రుబియా హైడర్ (54; 77 బంతుల్లో 8×4) కీలకమైన అర్ధ శతకంతో అద్భుతంగా రాణించింది. కెప్టెన్ నిగర్ సుల్తానా (23), శోభన మోస్తరీ (24 నాటౌట్) సైతం రుబియాకు చక్కటి మద్దతు ఇచ్చారు. దీంతో బంగ్లాదేశ్ కేవలం 31.1 ఓవర్లలోనే మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయ తీరాన్ని చేరింది.
ఈ ఓటమితో పాకిస్థాన్ జట్టు బలహీనతలు స్పష్టమయ్యాయి. ముఖ్యంగా బంగ్లాదేశ్ స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో పాక్ బ్యాటర్లు తడబడ్డారు. రాబోయే మ్యాచ్‌లో పాకిస్థాన్ తన చిరకాల ప్రత్యర్థి అయిన భారత్‌తో తలపడనుంది. భారత జట్టులో దీప్తి శర్మ, స్నేహ్ రాణా వంటి బలమైన స్పిన్నర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో, బంగ్లాదేశ్ చేతిలో ఎదురైన ఈ పరాజయం, రాబోయే కఠినమైన మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్ మేనేజ్‌మెంట్‌కు ఆందోళన కలిగించే విషయం. పాక్ బ్యాటర్లు త్వరగా తమ ఆటతీరును మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.