Deepika Padukone: గత కొన్ని రోజులుగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె గురించి సోషల్ మీడియాలో పలు వార్తలు వైరల్ అయ్యాయి. ఒకవైపు ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకురాలు ఫరాఖాన్ తో అన్‌ఫాలో వివాదం చర్చనీయాంశం కాగా, మరోవైపు IMDb నివేదికలో ఆమె సాధించిన రికార్డు అభిమానుల్లో సంతోషం నింపింది. తాజాగా దీపికా ఈ రెండు అంశాలపై స్పందించి తన అభిప్రాయాలను వెల్లడించారు.
ఫరాఖాన్‌తో అన్‌ఫాలో వివాదం
ఇటీవల దీపికా పదుకొణె, ఫరాఖాన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారని వార్తలు వచ్చాయి. దీనిపై ఫరాఖాన్ క్లారిటీ ఇస్తూ.. “మేమిద్దరం సోషల్ మీడియా ద్వారా కాదు, డైరెక్ట్‌గా మాట్లాడుకోవాలని నిర్ణయించుకున్నాం. అందుకే పుట్టినరోజు శుభాకాంక్షల పోస్ట్‌లు కూడా పెట్టుకోలేదు. అలాంటి విషయాలను అనవసరంగా వివాదాస్పదం చేయొద్దు” అని తెలిపారు.
దీనికి దీపికా రిప్లై ఇస్తూ— “ఫరాఖాన్ చెప్పింది నేనూ అనుకున్నదే.. తథాస్తు..” అంటూ ఎమోజీ షేర్ చేశారు. దీంతో ఈ చిన్న వివాదానికి ముగింపు పడింది.
IMDb నివేదికలో దీపికా రికార్డు
ఇక మరోవైపు IMDb తాజాగా విడుదల చేసిన ‘ఇయర్స్ ఆఫ్ ఇండియన్ సినిమా (2000–2025)’ నివేదికలో గత 25 ఏళ్లలో అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణుల జాబితాలో దీపికా నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. ముఖ్యంగా, మహిళా నటీనటుల్లో అగ్రస్థానం సాధించడం విశేషం. అదేవిధంగా ఆమె నటించిన పది సినిమాలు IMDb వార్షిక టాప్ లిస్టుల్లో చోటు చేసుకోవడం గర్వకారణమని తెలిపింది.
దీపికా మాట్లాడుతూ.. “నా కెరీర్‌లో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నాను. ఎప్పుడూ సవాళ్లను స్వీకరించడంలో వెనుకాడలేదు. ప్రశ్నలు అడగడానికి, రిస్క్ తీసుకోవడానికి, ప్రస్తుత పరిస్థితిని సవాలు చేయడానికి నాకు భయం లేదు. నా కుటుంబం, అభిమానుల మద్దతే నాకు శక్తినిచ్చాయి. ఈ IMDb నివేదిక నా ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది” అని భావోద్వేగంగా స్పందించారు.
కొత్త సినిమాలపై ఆసక్తి
ఇక వర్క్‌ఫ్రంట్‌లో దీపిక ప్రస్తుతం షారుఖ్ ఖాన్ తో కలిసి ‘కింగ్’ సినిమాలో నటిస్తున్నారు. అదేవిధంగా దర్శకుడు అట్లీ దర్శకత్వంలో వస్తున్న సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ ‘AA22xA6’ లో కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.