TVK Vijay: తమిళనాడులోని కరూర్‌లో టీవీకే (తమిళగ వెట్రి కళగం) పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు దళపతి విజయ్ ప్రచార సభలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 41 మంది ప్రాణాలు కోల్పోగా, ఇంకా పలువురు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేసింది. పోలీసులూ కొన్ని అరెస్టులు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.
తాజాగా ఈ సంఘటనపై విజయ్ మొదటిసారి స్పందించారు. సుమారు ఐదు నిమిషాలపాటు ఉన్న వీడియోను విడుదల చేస్తూ తన మనసులోని బాధను వ్యక్తం చేశారు. “నా జీవితంలో ఇలాంటి విషాదకరమైన సంఘటనను ఎప్పుడూ చూడలేదు. నా హృదయం బాధతో నిండిపోయింది. ఎంతో ప్రేమతో నా మీటింగ్‌కు వచ్చిన ప్రజలు ఇలా ప్రాణాలు కోల్పోవడం నాకు చాలా బాధ కలిగిస్తోంది” అని భావోద్వేగంగా పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: V C Sajjanar: ‘ఆడపిల్లల జోలికి వస్తే చుక్కలు చూపిస్తా’.. సజ్జనార్ వార్నింగ్
విజయ్ మాట్లాడుతూ – “నేను మనిషినే. అంతమంది చనిపోయి బాధపడుతుంటే నేను వెళ్ళిపోతానా? మళ్ళీ ఇబ్బందులు రాకూడదని నేను కరూర్ వెళ్లలేకపోయాను. త్వరలోనే బాధిత కుటుంబాలను కలుస్తాను” అని తెలిపారు. ఇంకా, “మా కార్యకర్తలపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడం అన్యాయం. తప్పు చేయకపోయినా కేసులు పెడుతున్నారు. కావాలంటే నాపై ప్రతీకారం తీర్చుకోండి కానీ నా కార్యకర్తల జోలికి మాత్రం పోవద్దు” అని సీఎం స్టాలిన్‌పై సంచలన ఆరోపణలు చేశారు.
“ఇలాంటి ఘటన కరూర్‌లోనే ఎందుకు జరిగింది? అనుమతి తీసుకున్న ప్రదేశంలోనే సభ జరిగింది. ఈ ఘటనకు కారణాలు ఒక్కొక్కటిగా బయటపడతాయి. నేను మరింత బలంగా ముందుకు వస్తాను” అని వీడియోలో స్పష్టంచేశారు.
ప్రస్తుతం ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారగా, రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికి ఆర్థిక సాయం ప్రకటించింది. విజయ్ కూడా తనవంతుగా మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఈ విషాద ఘటనకు తగిన న్యాయం జరిగే వరకు తాను మౌనంగా ఉండబోనని, నిజం బయటపడుతుందనే నమ్మకం ఉందని విజయ్ తెలిపారు.
— TVK Vijay (@TVKVijayHQ) September 30, 2025